Hyderabad: మాజీ నీటిపారుదలశాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) మురళీధర్ రావును ఆదాయానికి మించి ఆస్తుల కలిగిన కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అరెస్ట్ చేశారు. మంగళవారం ఉదయం నుంచి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, కోదాడ ప్రాంతాల్లోని ఆయనకు సంబంధించిన 11 ప్రదేశాల్లో ఏసీబీ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు.
ఈ దాడుల్లో మురళీధర్ రావు పేరిట భారీ స్థాయిలో భూములు, భవనాలు, విలాసవంతమైన ఇంటీరియర్, బంగారు ఆభరణాలు, ఇతర విలువైన ఆస్తులు బయటపడ్డాయి. ఆయన పేరుతో కోకాపేట, బంజారాహిల్స్, బేగంపేట్, యూసుఫ్‌గూడా తదితర ప్రాంతాల్లో కోట్ల రూపాయల విలువ చేసే ప్లాట్లు, ఇండ్లు ఉన్నట్లు గుర్తించారు. అలాగే హైదరాబాద్ శివారులో 11 ఎకరాల భూమి, మోకిలాలో 6,500 చదరపు గజాల స్థలం, నాలుగు ఇండ్ల స్థలాలు, బోలెడంత బంగారు ఆభరణాలు ఉన్నట్లు అధికారుల ప్రాథమిక నివేదిక వెల్లడించింది. అంతేకాకుండా సోలార్ పవర్ ప్రాజెక్టులో కూడా ఆయనకి వాటాలు ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిధుల చెల్లింపుల్లో మురళీధర్ రావు కీలక పాత్ర పోషించినట్టు సమాచారం. ఈ క్రమంలో తన కుమారుడు అభిషేక్ రావు సొంత కంపెనీ అయిన హర్ష కన్స్ట్రక్షన్స్‌కు నిధులు మళ్లించారన్న ఆరోపణలు వస్తున్నాయి. కేవలం కాళేశ్వరం మాత్రమే కాక, పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులోనూ పెద్ద ఎత్తున సబ్‌కాంట్రాక్టులు వారి బినామీలకు అప్పగించినట్టు తెలుస్తోంది. వర్క్ ఆర్డర్లు జారీ ప్రక్రియలోనూ మురళీధర్ రావు అనేక అక్రమాలకు పాల్పడ్డారని సమాచారం.
ఈ కేసు రాష్ట్ర రాజకీయాలలో కలకలం రేపుతుండగా, నీటిపారుదల శాఖలో ఏ మేరకు అవినీతి ముళ్లుగూళ్లుగా ఏర్పడిందన్నదానిపై ఇప్పుడు ప్రజా సంఘాలు, న్యాయవాదులు, రాజకీయ పార్టీలన్నీ దృష్టిసారిస్తున్నాయి. మురళీధర్ రావుపై వచ్చే రోజుల్లో మరిన్ని అవినీతి సంబంధిత విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.

