Kota Srinivasa Rao: తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటును మిగిల్చి కన్నుమూసిన దిగ్గజ నటుడు కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు ఈరోజు హైదరాబాద్‌లో పూర్తయ్యాయి. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన కోట శ్రీనివాసరావుకు సినీ ప్రముఖులు, అభిమానులు, కుటుంబ సభ్యులు అశ్రునయనాల మధ్య కడసారి వీడ్కోలు పలికారు.
అశ్రునయనాల వీడ్కోలు:
కోట శ్రీనివాసరావు మరణ వార్త వినగానే టాలీవుడ్ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయనను కడసారి చూసేందుకు, నివాళులర్పించేందుకు పెద్ద సంఖ్యలో సినీ ప్రముఖులు, అభిమానులు, కళాకారులు ఆయన నివాసానికి చేరుకున్నారు. ఫిల్మ్‌నగర్‌లోని కోట శ్రీనివాసరావు నివాసం నుండి జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానం వరకు అంతిమ యాత్ర జరిగింది. ఈ యాత్రలో వేలాది మంది అభిమానులు, సినీ ప్రముఖులు పాల్గొని తమ అభిమాన నటుడికి నివాళులర్పించారు.
మహాప్రస్థానంలో అంతిమ సంస్కారాలు:
అంతిమ యాత్ర అనంతరం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు శాస్త్రోక్తంగా జరిగాయి. కుటుంబ సభ్యుల సమక్షంలో ఆయన పెద్ద మనవడు శ్రీనివాస్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. సినీ ప్రముఖులు, బంధువులు, స్నేహితులు ఈ అంత్యక్రియల్లో పాల్గొని కోట శ్రీనివాసరావుకు కన్నీటి వీడ్కోలు పలికారు. తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన నటనతో నాలుగు దశాబ్దాలకు పైగా ప్రేక్షకులను అలరించిన కోట శ్రీనివాసరావు మరణం పట్ల సినీ లోకం తీవ్ర సంతాపంలో మునిగిపోయింది. ఆయన లేని లోటు తీర్చలేనిదని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు.