Leopards in Balapur: హైదరాబాద్ శివార్లలో చిరుతల సంచారం మరోసారి కలకలం రేపుతోంది. బాలాపూర్ ప్రాంతంలో రెండు చిరుతలు తిరుగుతున్నట్టు అధికారులు ధ్రువీకరించారు. ముఖ్యంగా రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (RCI) ప్రాంగణంలో ఇవి కనిపించడం చుట్టుపక్కల ప్రజల్లో భయాందోళనకు దారి తీసింది.
ప్రజలకు హెచ్చరికలు
చిరుతలు బయట తిరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. సాయంత్రం తర్వాత ఒంటరిగా బయటకు రావద్దని, అనుమానం వచ్చిన వెంటనే పోలీసులకు, అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని హెచ్చరించారు.
వేట మొదలుపెట్టిన అటవీశాఖ
అటవీశాఖ అధికారులు ఇప్పటికే చిరుతల కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు. సీసీ కెమెరాల ద్వారా చిరుతల కదలికలు గమనించి, పంజరాలు, కెమెరాలు పెట్టారు. ఇక డ్రోన్ల సహాయంతో కూడా చిరుతల ఆచూకీ కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు.
ఎందుకు నగర శివార్లకి వస్తున్న చిరుతలు?
వన్యప్రాణుల అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం.. అడవుల సంరక్షణ తగ్గడం, జనాభా పెరగడం, అడవుల్లోకి మానవులు చొచ్చుకుపోవడం వంటి కారణాల వల్ల చిరుతలు నగర శివార్లకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఆకలితో ఉన్నపుడు చిరుతలు దాడికి దిగే అవకాశం కూడా ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు..
ఇది కూడా చదవండి: AP Liquor Scam Case: కర్మ చేయడం నీ హక్కు.. ఫలితాలపై నీకు హక్కు లేదు.. నేడు మరోసారి సిట్ విచారణకు సాయిరెడ్డి..
పిల్లల కోసం జాగ్రత్తలు తీసుకోవాలి
ప్రస్తుతం ఆ ప్రాంతంలో పిల్లలు స్కూళ్లకు వెళ్లడానికే భయపడుతున్నారు. రీసెర్చ్ సెంటర్ సిబ్బంది, కార్మికులు కూడా భయంతో ఉన్నారు. భద్రతా కారణాలతో RCI లోపలికి అనుమతులు నిలిపివేశారు.
భవిష్యత్తులో ముందు జాగ్రత్తలు అవసరం
ఈ ఘటనతో హైదరాబాద్‌లో భద్రతపై ప్రశ్నలు లేవబడ్డాయి. భవిష్యత్తులో ఇలాంటి వన్యప్రాణుల ప్రవేశాలు నివారించేందుకు పటిష్టమైన ప్రణాళికలు అవసరమని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు.

