TG News: తెలంగాణ రాష్ట్రంలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 14వ తేదీన (ఆదివారం) సూర్యపేట జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తారు.
ఈ పంపిణీతో రాష్ట్రవ్యాప్తంగా 2.4 లక్షల కొత్త రేషన్ కార్డులు లబ్ధిదారులకు అందనున్నాయి. దీని ద్వారా సుమారు 11.30 లక్షల మంది నిరుపేదలకు ప్రయోజనం చేకూరనుంది. గత ఆరు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం 41 లక్షల మందికి కొత్త రేషన్ పంపిణీ చేసిందని, ఇప్పుడు జారీ చేయనున్న కార్డులతో కలిపి రాష్ట్రంలో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య 94,72,422కు చేరుకుంటుందని అధికారులు తెలిపారు. దీనితో మొత్తంగా 3 కోట్ల 14 లక్షల మందికి పైగా ప్రజలు లబ్ధి పొందనున్నారు.
కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. గతంలో దరఖాస్తులు స్వీకరించినప్పటికీ, పంపిణీ మాత్రం జరగలేదు. అయితే, జూలై 14న సీఎం రేవంత్ రెడ్డి కార్డులు జారీ చేసిన తర్వాత, రాష్ట్రవ్యాప్తంగా కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. ప్రజలు ఎప్పుడైనా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు, అలాగే ఇప్పటికే ఉన్న కార్డుల్లో మార్పులు కూడా చేసుకోవచ్చు.
Also Read: Kavita: బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ పై అనుమానాలున్నాయి
ఈ కార్యక్రమం సన్నాహక సమావేశంలో రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సామాజిక న్యాయానికి కట్టుబడి పనిచేస్తుందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు ఇస్తామని, ఇది నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేశారు. పేద ప్రజలకు ఆహార భద్రత కల్పించే సంక్షేమ పథకాలలో ఇది ఒక భాగమని ఆయన పేర్కొన్నారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ వంటి కార్యక్రమాలను విజయవంతం చేశామని, బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి చట్టం తెచ్చామని ఆయన వివరించారు.
ప్రస్తుతం జారీ చేసేవి స్మార్ట్ కార్డులా లేక సాధారణ కార్డులా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. అయినప్పటికీ, 13,000 కోట్ల రూపాయల వ్యయంతో 3.10 కోట్ల మందికి 6 కేజీల సన్నబియ్యం ఉచితంగా అందించి 95 లక్షల కుటుంబాలకు చెందిన పేదవారికి కడుపు నిండా అన్నం పెట్టి ఆకలి తీర్చడం తమకు ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని ఇస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వాలు ఉప ఎన్నికలు ఉన్నప్పుడే రేషన్ కార్డులు ఇచ్చేవని, కానీ తమ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ నిరంతరం రేషన్ కార్డులు అందిస్తుందని ఆయన వివరించారు.