Madaram Jatara 2026: వనదేవతలు సమ్మక్క, సారలమ్మ కొలువై ఉన్న మేడారం మహాజాతర తేదీలను ఆలయ పూజారులు ఖరారు చేశారు. తెలంగాణలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఈ జాతర జరుగుతుంది. 2026 జనవరి నెలలో అమ్మవారి జాతరను నిర్వహించనున్నట్టు కోయ పూజారులు వెల్లడించారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ జాతరకు తెలంగాణ, ఏపీ సహా వివిధ రాష్ట్రాల నుంచి భక్తజనం తరలివచ్చి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటారు.
Madaram Jatara 2026: 2026 జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు మేడారం జాతరను నిర్వహించనున్నట్టు కోయ పూజారులు ప్రకటించారు. తొలిరోజైన 28న సాయంత్రం 6 గంటలకు కన్నెపల్లి నుంచి సారలమ్మను, గోవిందరాజు, పగిడిద్దరాజులను గద్దెపైకి తీసుకురావడంతో జాతర మొదలవుతుంది. రెండో రోజైన 29న సాయంత్రం 6 గంటలకు చిలకలగుట్ట నుంచి సమ్మక్క దేవతను గద్దె మీదికి తీసుకొస్తారు. 30న దేవతలకు భక్తులు తమ మొక్కులను చెల్లించే కార్యక్రమం ఉంటుంది. 31న సాయంత్రం 6 గంటల సమయంలో సమ్మక్క, సారలమ్మ దేవతలు, గోవిందరాజు, పగిడిద్దరాజు దేవుళ్ల వనప్రవేశంతో జాతర ముగుస్తుందని కోయ పూజారులు వివరించారు.
Madaram Jatara 2026: ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పిలుచుకునే ఈ మేడారం జాతర నిర్వహణకు ఏర్పాట్లు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆలయ నిర్వాహకులు కోరారు. భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఇప్పటి నుంచి చొరవ తీసుకోవాలని వారు కోరారు.


