Pawan Kalyan: మహాన్యూస్ కార్యాలయంపై బీఆర్‌ఎస్‌కు చెందిన కొందరు వ్యక్తులు దాడికి పాల్పడటంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. సుమారు 30 మందికి పైగా ఉన్న ఈ గుంపు ఇనుప రాడ్లు, బండరాళ్లతో బీభత్సం సృష్టించారు. పట్టపగలే జరిగిన ఈ దాడిలో, దుండగులు కార్యాలయం ముందు నిలిపి ఉన్న కార్లపై రాళ్లు రువ్వారు. ప్రధాన ద్వారం అద్దాలను పగలగొట్టి, లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. లోపల ఉన్న టీవీని ధ్వంసం చేయడమే కాకుండా, పూల కుండీలను విసిరికొట్టి విధ్వంసం సృష్టించారు.
మహాన్యూస్ సిబ్బందిపై కూడా ఇనుప రాడ్లతో దాడి చేసేందుకు యత్నించారు. అరుపులు, కేకలతో భయానక వాతావరణాన్ని సృష్టించి, కార్యాలయంలోని సిబ్బందిని, ముఖ్యంగా మహిళా జర్నలిస్టులను భయభ్రాంతులకు గురిచేశారు. వారిపై కూడా దాడికి యత్నించారు.
Pawan Kalyan: హైదరాబాద్‌లోని ప్రముఖ వార్తా ఛానెల్ మహా న్యూస్ ప్రధాన కార్యాలయంపై ఇటీవల జరిగిన దాడిని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. వార్తలు, కథనాలపై అభ్యంతరాలు ఉంటే తెలియజేయడానికి ఇది సరైన పద్ధతి కాదని ఆయన స్పష్టం చేశారు. మీడియా సంస్థలపై దాడులకు పాల్పడటం ఎంతమాత్రం సమంజసం కాదని పేర్కొన్న పవన్ కళ్యాణ్, మహా న్యూస్ ఛానెల్‌పై జరిగిన ఈ దాడిని ప్రజాస్వామ్యవాదులు తప్పనిసరిగా ఖండించాలని పిలుపునిచ్చారు. ఈ దాడికి కారకులైన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు.

