Donald Trump: ఆంతార్జాతీయ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారిన ఒక తాజా పరిణామం… పాకిస్థాన్ ప్రభుత్వం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను 2026 నోబెల్ శాంతి బహుమతికి అధికారికంగా నామినేట్ చేసింది. ఇటీవలి కాలంలో భారత్–పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ట్రంప్ వహించిన “దౌత్య పరమైన కీలక నాయకత్వం”కు గాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాకిస్థాన్ ప్రకటించింది.
ఈ నామినేషన్ వెనుక కథనమైతే మరింత ఆసక్తికరంగా మారింది. బుధవారం జరిగిన ఒక కీలక భేటీలో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్, ట్రంప్‌తో వైట్‌హౌస్‌లో సమావేశమయ్యారు. భేటీ ముగిసిన కొన్ని గంటల్లోనే పాకిస్థాన్ ప్రభుత్వం నోబెల్ నామినేషన్ ప్రకటనను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్’ ద్వారా విడుదల చేసింది. అయితే ఈ భేటీలోని వివరాలు మాత్రం అధికారికంగా వెల్లడించలేదు.
పాకిస్థాన్ ప్రకటనలో, అణ్వాయుధ సామర్థ్యం కలిగిన రెండు దేశాలైన భారత్, పాకిస్థాన్ మధ్య శాంతి స్థాపనకు ట్రంప్ చేసిన కృషిని ప్రస్తావిస్తూ, “ఆయన చతురదౌత్యం వల్ల అణు యుద్ధాన్ని నివారించగలిగారు. అంతర్జాతీయ శాంతికి ఆయన చేసిన ఈ సేవ అతి విలువైనది” అని పేర్కొంది. దీనికి తోడు, ట్రంప్ ఇప్పటికే తనపై నోబెల్ కమిటీ ఎందుకు దృష్టి పెట్టడం లేదన్న ఆవేదన కూడా పలు సందర్భాల్లో వ్యక్తపరచిన సంగతి తెలిసిందే.ఇది
ఇది కూడా చదవండి: Guinness World Record: యోగాంధ్రకు గిన్నిస్ బుక్ రికార్డు.. ఏకంగా 3.20 లక్షల మంది హాజరు
ఇదిలా ఉండగా, ఈ నామినేషన్‌పై ప్రపంచవ్యాప్తంగా మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు విశ్లేషకులు దీన్ని “పాకిస్థాన్ యొక్క వ్యూహాత్మక దౌత్య చర్య”గా అంచనా వేస్తుండగా, మరికొందరు భారతదేశాన్ని రెచ్చగొట్టే ప్రయత్నంగా అభివర్ణిస్తున్నారు. అదేవిధంగా, ఈ చర్యను ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఒక వ్యూహాత్మక నడకగా కూడా పరిగణిస్తున్నారు.
అసలే ఇటీవలే ‘ఫీల్డ్ మార్షల్’ హోదా పొందిన అసిమ్ మునీర్‌కు వైట్‌హౌస్ నుంచి వచ్చిన ఆహ్వానం పాకిస్థాన్‌కి ఒక గౌరవ అంశంగా నిలిచింది. 1959లో అయూబ్ ఖాన్ తరువాత ఫీల్డ్ మార్షల్ హోదా పొందిన రెండో అధికారి మునీర్ కావడం విశేషం.
అంతర్జాతీయ రాజకీయాలలో శాంతి కోసం ఎంతటివారైనా నోబెల్ బహుమతి కోసం పోటీ పడుతున్న ఈ రోజుల్లో, ట్రంప్‌కు పాకిస్థాన్ నామినేషన్ చేయడాన్ని గమనీయం గానే కాక, తదుపరి అంతర్జాతీయ మార్పులకు దోహదపడే పరిణామంగా భావించవచ్చు. కానీ ఇదంతా ఎంతవరకు నిజమవుతుందో, ట్రంప్ నిజంగా నోబెల్ గెలుస్తాడా అనే ప్రశ్నలకు సమాధానం మాత్రం కాలమే ఇవ్వాలి.

