IPL 2025: కేఎల్ రాహుల్..టన్నుల్లో టాలెంట్ బ్యాటింగ్ లో జీరో అవుతున్నాడు. ఇప్పటికే టీమిండియా టీ20 జట్టులో చోటు లేదు. కివీస్ తో జరిగిన రెండో టెస్టుకు తుది జట్టులో చోటు దక్కలేదు. ఇప్పుడు ఐపీఎల్ వంతు వచ్చింది. ఇక్కడా కేఎల్ రాహుల్‌కు కలిసి వచ్చేలా లేదు. గత మూడేళ్లుగా కెప్టెన్‌గా ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చిన లక్నో సూపర్‌జెయింట్స్ ఫ్రాంఛైజీకి కూడా దూరం కాబోతున్నట్లు తెలుస్తోంది.
IPL 2025: ఐపీఎల్ మ్యాచ్ లకు మించి మెగావేలం మస్తు మజాను అందిస్తోంది. ఏయే జట్లలో ఏయే ఆటగాళ్లు ఉంటారో ..ఎవరు వేలంలోకి వస్తారో అనుకుంటూ తెగ ఇదయిపోతున్నారు క్రికెట్ ఫ్యాన్స్. ముఖ్యంగా లక్నో సూపర్ జెయింట్స్ నుంచి రాహుల్ తప్పుకుంటాడా.. లేక కొనసాగుతాడా..? అన్న ఉత్కంఠకు తెర పడినట్లే కనిపిస్తోంది. వచ్చే సీజన్ కోసం మెగా వేలం జరగనున్న నేపథ్యంలో లక్నో రిటెన్షన్ జాబితాలో రాహుల్ ఉండబోడట. రాహుల్ అందుబాటులో లేని మ్యాచ్‌ల్లో జట్టును నడిపించిన వెస్టిండీస్ వికెట్ కీపర్, బ్యాటర్ నికోలస్ పూరన్‌ను పూర్తి స్థాయి కెప్టెన్‌గా నియమించాలని ఫ్రాంఛైజీ భావిస్తున్నట్లు సమాచారం. దీంతో రాహుల్ వేలంలోకి రావడం దాదాపు ఖాయమని తెలుస్తోంది. ఈ ఏడాది ఐపీఎల్ పూర్తవగానే రాహుల్.. లఖ్‌నవూతో బంధం తెంచుకోనున్నట్లు వార్తలొచ్చాయి. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో లక్నో చిత్తుగా ఓడడంతో ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గోయెంకా బహిరంగంగా తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో రాహుల్ అలిగాడని, దీంతో ఆ ఫ్రాంఛైజీకి దూరం కావాలని భావిస్తున్నాడని అప్పట్లోనే కథనాలు వచ్చాయి. కాగా, ఇటీవల రాహుల్.. గోయెంకాను కలవడంతో కథ మారినట్లు కనిపించింది. రాహుల్ తమ జట్టులో అంతర్భాగమని గోయెంకా ఆ సందర్భంగా పేర్కొన్నాడు. దీంతో రాహుల్.. లఖ్‌నవూతోనే కొనసాగుతాడని అంతా భావించారు. కానీ ఇప్పుడేమో రాహుల్‌కు ఎల్‌ఎస్‌జీకి టాటా చెప్పబోతున్నట్లు జట్టు వర్గాల ద్వారా తెలుస్తోంది.
IPL 2025: ఐపీఎల్ 2025 సీజన్‌కు సంబంధించి అన్ని ఫ్రాంచైజీలు తమతమ రిటైనర్ల జాబితాను సమర్పించడానికి అక్టోబర్ 31 డెడ్ లైన్ అని బీసీసీఐ తెలిపింది. ప్రస్తుతమున్న సమాచారం మేరకు ఒక్కో ఫ్రాంచైజీ ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవచ్చు. ఇందులో గరిష్టంగా అయిదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లకు అవకాశం ఉంటుంది. రిటైన్ చేసుకునే క్యాప్డ్ ప్లేయర్లకు ఛాయిస్ ప్రకారం వరుసగా 18, 14, 11 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. రిటైన్ చేసుకునే అన్‌క్యాప్డ్ ప్లేయర్‌కు 4 కోట్లు పారితోషికం చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీలన్నీ తమ తమ రిటైన్ లిస్ట్‌ను దాదాపుగా ఖరారు చేసుకున్నాయి. అన్ని ఫ్రాంచైజీల బాటలోనే లక్నో సూపర్ జెయింట్స్ కూడా నడుస్తోంది.
IPL 2025: లక్నో ఫ్రాంచైజీ ఈ సారి రాహుల్ లేకుండానే తమ రిటైన్ జాబితాను సిద్దం చేసుకున్నట్లు జట్టు వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఫస్ట్ చాయిస్ కింద నికోలస్ పూరన్‌ను రాహుల్ స్థానంలో కెప్టెన్ గా ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. పూరన్‌కే కెప్టెన్సీ బాధ్యతలు కూడా కట్టబెట్టనున్నట్లు తెలుస్తుంది. ఇదే కరెక్ట్ అయితే పూరన్‌కు పారితోషికం కింద రూ. 18 కోట్లు దక్కనున్నాయి. ఎల్‌ఎస్‌జీ.. పూరన్‌తో పాటు మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్, ఆయుశ్ బదోని, మొహిసిన్ ఖాన్‌లను రిటైన్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఫ్రాంచైజీ మయాంక్ యాదవ్‌ను సెకెండ్ ఛాయిస్‌గా ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే మయాంక్ యాదవ్‌కు రూ. 14 కోట్లు దక్కనున్నాయి. 2024 ఐపీఎల్ సీజన్‌లో అరంగేట్రం చేసిన మయాంక్ కేవలం 4 మ్యాచ్‌లే ఆడాడు. ఇందులో 7 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటికే రాహుల్ కు ఏదీ కలిసి రావడం లేదు. టెస్టు తుది జట్టులోనూ చోటుపై ఆశల్లేవు. బ్యాటింగ్ లో వరుసగా విఫలం కావడం.. మైదానంలో ఏదీ కలిసి రాకపోవడంతో పాటు ఇప్పుడు ఐపీఎల్ లోనూ అతనికి బ్యాడ్ టైం స్టార్ట్ అయిందా అన్నట్లుగా కనిపిస్తోంది. ఏది ఏమైనా వేలంలోనైనా రాహుల్ కు కలిసి రావాలని అతని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.