Botsa Satyanarayana: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం (జూన్ 4) చీపురుపల్లిలో నిర్వహించిన “వెన్నుపోటు దినం” కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో వేదికపై ప్రసంగిస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వడదెబ్బ కారణంగా సొమ్మసిల్లిన బొత్సను వెంటనే కార్యకర్తలు సమీపంలోని గరివిడి ఆసుపత్రికి తరలించారు.
వైద్యులు ప్రాథమిక పరీక్షల అనంతరం బొత్స ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వెల్లడించారు. తీవ్రమైన వేడి కారణంగా డీహైడ్రేషన్ ఏర్పడి వడదెబ్బ తగలడం వల్ల అస్వస్థతకు గురయ్యారని వైద్యులు తెలిపారు.
రాజకీయ నేపథ్యం:
ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ.. ప్రజలను మోసం చేసిన ప్రభుత్వాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఇది కూడా చదవండి: IPL 2025 Prize Money: ఐపీఎల్ విజేత ఆర్‌సీబీకి దక్కిన ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా..?
పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు, ఎన్నికల ఫలితాల రోజైన జూన్ 4ను ‘వెన్నుపోటు దినంగా’ పాటించాలని వైసీపీ నిర్ణయించింది. ఈ నేపధ్యంలో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వైసీపీ నాయకులు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
బొత్స ఆరోగ్యం పై పార్టీ స్పందన:
బొత్స సత్యనారాయణ ఆరోగ్యంపై వైసీపీ నేతలు స్పందిస్తూ.. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. “ఇది తాత్కాలిక అస్వస్థత మాత్రమే, ఆయన త్వరలోనే తిరిగి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు” అని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.