Manchu Vishnu: పాన్-ఇండియా సినిమా ‘కన్నప్ప’ విడుదలకు ముందే సంచలన వివాదంలో చిక్కుకుంది. ముంబైలోని హైవ్ స్టూడియోస్ నుంచి హైదరాబాద్‌లోని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీకి కొరియర్‌లో పంపిన కీలక హార్డ్ డ్రైవ్ మాయమైంది. ఈ డ్రైవ్‌ను ఆఫీస్ బాయ్ రఘు, చరిత అనే యువతికి అప్పగించాడు. కానీ, చరిత ఆ తర్వాత కనిపించకుండా పోయింది. ఈ ఘటనపై 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ కుమార్ రెడ్డి ఫిల్మ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.
చెన్నైలో జరిగిన ‘కన్నప్ప’ ప్రమోషన్స్‌లో విష్ణు మంచు సంచలన వ్యాఖ్యలు చేశారు. “మా సినిమాను ఎంతో శ్రమతో తెరకెక్కించాం. ఇలాంటి కుట్రలు మమ్మల్ని ఆపలేవు. పైరసీ కంటెంట్‌ను షేర్ చేయొద్దని కోరుతున్నా,” అని అన్నారు. విష్ణు టీమ్ ఈ ఘటన వెనుక మంచు మనోజ్ హస్తం ఉందని ఆరోపిస్తోంది. రఘు, చరితలు మనోజ్ ఆఫీస్‌తో సంబంధం కలిగి ఉన్నారని, ఈ కుట్ర సినిమా విడుదలను అడ్డుకునేందుకే జరిగిందని విష్ణు వర్గం ఆరోపణలు చేస్తోంది. మనోజ్ వర్గం ఈ ఆరోపణలను ఖండించింది. ఈ డ్రామా ‘కన్నప్ప’ విడుదలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.