Canada: కెనడాలోని పశ్చిమ ప్రాంతాల్లో కార్చిచ్చు ధాటిగా వ్యాపిస్తోంది. ముఖ్యంగా సస్కట్చివాన్ (Saskatchewan) ప్రావిన్స్‌లో పరిస్థితి విషమంగా మారడంతో అధికారులు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఇప్పటికే ప్రావిన్స్‌లో సుమారు 6,69,000 ఎకరాలపై కార్చిచ్చు ప్రభావం చూపింది. ఈ ప్రాంతం నుండి 4,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
సస్కట్చివాన్ ప్రీమియర్ స్కాట్ మో మాట్లాడుతూ, ఇది చాలా తీవ్రమైన విపత్తుగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. ‘‘ఇలాంటి పరిస్థితులు గతంలో అరుదుగా మాత్రమే చూశాం,’’ అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రావిన్స్ మొత్తం మీద 14 పెద్ద కార్చిచ్చులు అదుపు లేకుండా ఎగసిపడుతున్నాయి.
కార్చిచ్చు ప్రభావం అక్కడితో ఆగకుండా మాంటోబా ప్రావిన్స్ వరకూ విస్తరించింది. అక్కడ 17,000 మందికి పైగా ప్రజలను బలవంతంగా ఇళ్ల నుంచి ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది. కెనడా వైమానిక దళం సహాయక చర్యల కోసం రంగంలోకి దిగింది. మాంటోబాలో ఇప్పటివరకు 1,73,000 ఎకరాలు కాలి బూడిద అయ్యాయి.
పర్యావరణ అధికారులు చెబుతోన్న వివరాల ప్రకారం, ఈ మంటలు అదుపు కావాలంటే కనీసం రెండు నుండి మూడు రోజులపాటు వర్షం పడాల్సిన అవసరం ఉంది. లేకుంటే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది.
కేవలం 2025 సంవత్సరం ప్రారంభం నుంచే సస్కట్చివాన్ మరియు మాంటోబా ప్రావిన్సుల్లో కలిపి 15 లక్షల ఎకరాలకుపైగా అడవులు మంటల్లో కాలిపోయాయి. ఈ పొగ వాతావరణంతో కలిసి అమెరికాలోని మిన్నెసోటా, మిషిగాన్ రాష్ట్రాల వైపు ప్రయాణిస్తోంది. ఇది అక్కడి ప్రజలకు శ్వాస సంబంధిత ఆరోగ్య సమస్యలు కలిగించే ప్రమాదం ఉన్నదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read: Mamata Banerjee: నరేంద్ర మోదీపై మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు
Canada: కెనడా సహజ వనరుల విభాగం ఇచ్చిన లెక్కల ప్రకారం, 2025లో ఇప్పటివరకు మొత్తం 6,000కి పైగా అగ్ని ప్రమాదాలు సంభవించాయి, వీటి వల్ల 3.7 కోట్ల ఎకరాల అడవులు దగ్ధమయ్యాయి. ఇది కెనడా చరిత్రలోనే అత్యంత భారీగా కార్చిచ్చు వ్యాపించిన సంవత్సరం అవుతోంది.
ప్రభుత్వాలు అన్ని మద్దతులతో సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ, పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయడం, అవసరమైన సాయం అందించడం కోసం రాత్రింబవళ్ళు అధికార యంత్రాంగం పని చేస్తోంది.
ఈ కార్చిచ్చు కేవలం ప్రకృతి ప్రమాదంగా మాత్రమే కాక, ప్రజల జీవన పరిస్థితులపై, ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. విపత్తు నేవరణ చర్యలు ఎంత వేగంగా జరుగుతాయో, వాతావరణం ఎంత సహకరిస్తుందో అనే దానిపై రాబోయే రోజుల పరిస్థితి ఆధారపడి ఉంటుంది.