Amritsar

Amritsar: అమృత్‌సర్‌లో బాంబు పేలుడు కలకలం

Amritsar: పంజాబ్‌లోని అమృత్‌సర్‌ నగరాన్ని మంగళవారం ఉదయం ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది ఓ బాంబు పేలుడు. మజితా రోడ్ బైపాస్ సమీపంలో ఉన్న డీసెంట్ అవెన్యూ కాలనీ వద్ద ఈ పేలుడు చోటు చేసుకుంది. ఉదయం 9:30 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.

ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆ వ్యక్తి బాంబును అక్కడ ఉంచే ప్రయత్నంలో ఉన్న సమయంలో అది అకస్మాత్తుగా పేలిపోయిందని భావిస్తున్నారు. పేలుడు ధాటికి అతడి శరీరానికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే అతడిని సమీప ఆసుపత్రికి తరలించినా, అప్పటికే అతడి పరిస్థితి విషమించిందని వైద్యులు తెలిపారు.

పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని డాగ్ స్క్వాడ్‌, బాంబ్‌ స్క్వాడ్‌తో పరిశీలన చేపట్టారు. ఫోరెన్సిక్ బృందాలు పేలుడు పదార్థాన్ని విశ్లేషిస్తున్నాయి. గ్యాంగ్‌స్టర్ల ప్రమేయమా, లేక ఉగ్రవాద చర్యలో భాగమా అన్న కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. మృతుడు ప్రాథమికంగా ఓ స్క్రాప్ డీలర్‌గా గుర్తించబడ్డాడు. అయితే, అతడు నిషేధిత ఉగ్ర సంస్థ బబ్బర్ ఖల్సాతో సంబంధాలుండవచ్చని పోలీసుల అనుమానం. ఈ అనుమానంతో విచారణను మరింత వేగవంతం చేశారు.

Also Read: Narendra Modi: ఈసారి అంతా కెమెరా ముందు జరిగింది.. పాకిస్థాన్ పై మోదీ వ్యాఖ్యలు

Amritsar: పోలీసుల ప్రకారం, అటువంటి నిర్మానుష్య ప్రాంతాల్లో ఉగ్రవాద గ్రూపులు తరచూ పేలుడు పదార్థాలు మోహరించే ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ ఘటనలో కూడా బాంబు సరఫరా సమయంలో తప్పుడు రీతిలో ఆపరేట్ చేయడం వల్లే పేలుడు సంభవించి ఉండవచ్చని అధికారులు తెలిపారు.

గోల్డెన్ టెంపుల్‌కు సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకోవడం ప్రత్యేకంగా దృష్టి ఆకర్షిస్తోంది. గతంలో డిసెంబర్ 2024లో కూడా అమృత్‌సర్‌లోని పోలీస్ స్టేషన్ సమీపంలో పేలుడు సంభవించడంతో, ఈ ప్రాంతంలో ఉగ్రవాద శక్తుల కదలికలపై కొత్తగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రజలు భయాందోళన చెందవద్దని పోలీసులు హామీ ఇచ్చారు. పరిసర ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. మరిన్ని వివరాలు అధికారికంగా వెలుగులోకి వచ్చే వరకు, మృతుడి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *