Troubleshooter Trouble: బీఆర్ఎస్‌లో సమస్యలు వచ్చిన ప్రతిసారి ఆ సమస్య పరిష్కారం కోసం ఆయన రంగంలోకి దిగాల్సిందే. ఆయనే ట్రబుల్ షూటర్‌గా పేరున్న నేత హరీష్ రావ్. ఉద్యమ సమయం నుంచి ఇప్పటివరకు కేసీఆర్‌కి నమ్మిన బంటుగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో హరీష్ రావు కీలకంగా వ్యవహరించారు. అలాంటి నేతపై ఎన్నో రకాల విమర్శలు వస్తూనే ఉన్నాయి. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో కాంగ్రెస్‌లో చేరతారని ప్రచారం జరిగింది. ఇప్పుడేమో తెలుగుదేశం పార్టీ తెలంగాణ బాధ్యతలు చేపట్టబోతున్నారంటూ, రకరకాల పుకార్లు వస్తున్నాయ్.
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హరీష్ రావు కీలక నేతగా మారారు. రెండో సారి కేసీఆర్ అధికారంలో వచ్చాక మంత్రి పదవుల కేటాయింపు మొదటి లిస్ట్‌లో హరీష్ రావు పేరు లేకపోవడంతో… ఆయన్ని కేసీఆర్ దూరం పెట్టారనే వార్తలు వచ్చాయి. రెండవ లిస్ట్‌లో హరీష్ రావుకు పదవి కేటాయించారు. పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు ట్రబుల్ షూటర్‌గా హరీష్ రావు ఉంటారని పేరుంది. అలాంటి హరీష్ రావు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. ప్రతి ఎన్నికల సమయంలో ఆయన పార్టీ మారతారంటూ ప్రచారం జరుగుతుంది. కేటీఆర్‌కి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిన సమయంలో హరీష్ రావు బీఆర్ఎస్‌ని విడిచి వెళతారని ప్రచారం జరిగింది.
ఆ సమయంలో హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ గీసిన గీత దాటను అంటూ కుండబద్దలు కొట్టి చెప్పారు హరీష్ రావు. ఇక తర్వాత అధికారంలో నుంచి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా హరీష్ రావుపై తీవ్ర స్థాయిలో ప్రచారం జరిగింది. ఆయన కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకుని బీజేపీలోకి వెళతారని సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరిగింది. ఆ టైంలో కూడా హరీష్ రావు దాన్ని తీవ్రంగా ఖండించారు. ఇక పార్లమెంటు ఎన్నికల సమయంలో కూడా హరీష్ రావుపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. బీఆర్ఎస్‌ని వీడబోతున్నారు, బీజేపీలోకి లేకుంటే అధికార కాంగ్రెస్‌లోకి వెళుతున్నారు అంటూ జరిగిన ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
Also Read: Miss Telugu USA 2025: MBartstudio ఆధ్వర్యంలో మిస్ తెలుగు యూఎస్‌ఎ పోటీలు.. మే 25 న గ్రాండ్ ఫినాలె
Troubleshooter Trouble: ఇక బీఆర్ఎస్ రజతోత్సవ వేళ కూడా హరీష్ రావుపై తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. ప్లీనరీ బహిరంగ సభ కంటే ముందే హరీష్ రావు పార్టీని వీడతారని సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు వెలిశాయి. దాన్ని కూడా తీవ్రంగా ఖండించారు హరీష్ రావు. ఇక బహిరంగ సభ తర్వాత హరీష్ రావు కొత్త పార్టీ పెట్టబోతున్నారని మరోసారి ప్రచారం జరిగింది. ఇక దీనిపై పార్టీ నాయకులు వెళ్లి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఇలా పదేపదే తనపై వస్తున్న విమర్శలను తిప్పికొడుతూనే ఉన్నారు హరీష్ రావు. తాను కేసీఆర్ వెంటే ఉంటానని, క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేస్తానని మీడియాకు స్పష్టం చేశారు మరోసారి. ఇలా తనపై విమర్శలు వస్తున్న ప్రతిసారి హరీష్ రావు మాత్రం ఒకే మాట మీద ఉంటున్నారు. తాను కేసీఆర్ గీసిన గీతను దాటనని, ఆయన నిర్ణయమే శిరోధార్యమని నొక్కి చెబుతున్నారు. అంతేకాదు… పార్టీ నాయకత్వాన్ని కేటీఆర్‌కి అప్పగించాలని కేసీఆర్ అనుకుంటే తాను పూర్తిగా స్వాగతిస్తానని చెప్పారు హరీష్ రావు. ఇప్పటికే వందసార్లకు పైగా ఈ విషయం చెప్పానని… జీవితాంతం బీఆర్ఎస్ కార్యకర్తగానే కొనసాగుతానని అన్నారు. మాస్ లీడర్‌గా జనాల్లో గుర్తింపు ఉన్న హరీష్ రావుపై విమర్శలు చేయడం ద్వారా బీఆర్ఎస్‌ను దెబ్బ కొట్టాలని కాంగ్రెస్, బీజేపీలు చూస్తున్నాయని అంటున్నారు ఆయన అనుచరులు.

