DELHI: శరణార్థుల విషయంలో భారత సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. భారత్ అన్నది ధర్మశాల కాదని, ప్రతి ఒక్కరినీ శరణార్థులుగా అంగీకరించలేమని స్పష్టం చేసింది. వివిధ దేశాల నుండి వచ్చిన శరణార్థులకు భారత్ ఆశ్రయం ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది.
శ్రీలంక నుండి వచ్చిన శరణార్థుల పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు, తమకు భారత పౌరసత్వం కల్పించాలన్న వారు ముందుగా చట్టప్రకారం వెళ్ళాలని సూచించింది. దేశ భద్రత, ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని శరణార్థుల ఆమోదంపై కేంద్ర ప్రభుత్వమే నిర్ణయించాల్సిందేనని అభిప్రాయపడింది.
“భారత్ శరణార్థుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన దేశం కాదు. ఇది ధర్మశాల కూడా కాదు. శరణార్థుల పట్ల మానవతా దృక్పథం అవసరం అయినా, న్యాయపరంగా, భద్రతా పరంగా కొన్ని పరిమితులు ఉన్నాయి,” అని తీర్పులో పేర్కొంది.
తక్షణమే శరణార్థులు భారత భూభాగాన్ని విడిచిపెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ తీర్పు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కొందరు దీనిని దేశ సార్వభౌమత్వం పరిరక్షణకు తీసుకున్న నిర్ణయంగా భావిస్తుండగా, మరికొందరు మానవతా విలువలకు వ్యతిరేకంగా అభిప్రాయపడుతున్నారు.

