GVMC Deputy Mayor: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) ఎన్నికలు పూర్తై, మేయర్ పదవిని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) చేజిక్కించుకుంది. అయితే, డిప్యూటీ మేయర్ ఎంపిక మాత్రం కూటమికి తలనొప్పిగా మారింది. మొదట్లో మేయర్ టీడీపీకి, డిప్యూటీ మేయర్ జనసేనకే అన్న ప్రచారం సాగినా… వాస్తవ పరిస్థితులు మాత్రం గందరగోళంగా మారాయి.
జనసేన నేతలు పోరాడి చివరకు డిప్యూటీ మేయర్ పదవిని సాధించగలిగారు. గంగవరం డివిజన్ కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి పేరును జనసేన అధిష్టానం ఖరారు చేసింది. దీంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరిచింది. అయితే, ఈ నిర్ణయం కూటమి అంతర్గతంగా కొత్త చిచ్చును రేపింది.
టీడీపీ ఆశావాహులు అసంతృప్తితో మండిపడుతున్నారు. “మమ్మల్ని మభ్యపెట్టారు”, “ఇది ముందస్తు అంగీకారాలకు విరుద్ధం” అంటూ బ్రేక్‌ఫాస్ట్ సమావేశంలో హాట్ హాట్ చర్చలు జరిగినట్టు సమాచారం. డిప్యూటీ మేయర్ పదవి టీడీపీకి దక్కకపోవడం పట్ల కొందరు నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: Vemulawada Temple Issue: రాజన్ననా? భీమన్ననా? ఎందుకీ రాజకీయ రచ్చ?
అంతటితో పరిమితంకాలేదు.. సమన్వయ కమిటీ సమావేశంలోనూ వాగ్వాదం చోటు చేసుకుంది. కొన్ని సామాజిక వర్గాల కార్పొరేటర్లు సమావేశం నుంచి నిష్క్రమించి, బీచ్‌రోడ్‌లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో గోప్యంగా చర్చలు జరిపినట్టు సమాచారం. డిప్యూటీ మేయర్ ఎన్నికకు బహిష్కారం పెట్టాలన్న దాకా వారు చర్చించినట్టు ప్రచారం జోరుగా సాగుతోంది.
ఈ పరిణామాల నడుమ, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ నేతృత్వంలో ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. కానీ, అన్ని కూటమి కార్పొరేటర్లు హాజరవుతారో లేదో అనేది ఇప్పటికీ అనిశ్చితంగా ఉంది.
ఈ పరిణామాలు కూటమి సఖ్యతపై ప్రశ్నలు వేస్తున్నాయి. స్థానిక రాజకీయం లోపల ఎంత తలకిందులుగా మారుతోందో ఈ డిప్యూటీ మేయర్ ఎంపికే ప్రతిబింబిస్తోంది.

