Gulabi Hari Ram Story

Gulabi Hari Ram Story: హరీష్‌.. కేసీఆర్‌ బాటలో.. నడుస్తారా? నడిపిస్తారా?

Gulabi Hari Ram Story: బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తాజాగా పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. తాను పార్టీ మారుతున్నట్లు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారనీ, అది పూర్తిగా అవాస్తవమని చెప్పుకొచ్చారు. పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదన్నారు. గతంలో ఇలాంటి ప్రచారాలపై తాను సవాల్ విసిరానని, అప్పుడు వారు మౌనంగా ఉన్నారని, ఇప్పుడు మళ్లీ అదే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ను మించిన పార్టీ ఉంటేనే ఆలోచిస్తానని, అధికారం ఉండటం, లేకపోవడం ప్రజాస్వామ్యంలో సాధారణమని, అధికారం కోసమే పార్టీలో ఉండేవాళ్లం కాదని… బీఆర్‌ఎస్‌ నుంచి బయటకు వెళ్లినవారిని ఉద్దేశించి కొన్ని డైలాగులూ పేల్చారు.

పార్టీ నాయకత్వ బాధ్యతలపైనా హరీష్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఎవరికి బాధ్యతలు అప్పగించినా తనకు ఇబ్బంది లేదని, కేటీఆర్‌కు నాయకత్వం ఇస్తే సహకరిస్తానని, కేసీఆర్ చెప్పినట్లు వినే క్రమశిక్షణ గల కార్యకర్తల్లో తానూ ఒకడినని మరోసారి పార్టీ పట్ల, కేసీఆర్‌ పట్ల తన చిత్తశుద్ధిని చాటుకునే ప్రయత్నం చేశారు. అయితే, హరీష్ అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలోనే.. ఆయన మీడియా ముందుకొచ్చి ఈ వివరణ ఇవ్వడం ఆసక్తి రేకెత్తించింది. గతంలో ఇలాంటి ప్రచారాలపై స్పందించని హరీష్, ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి వివరణ ఇవ్వడం చర్చనీయాంశమైంది.

బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కమిటీ నియామక కసరత్తు జరుగుతున్న వేళ, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిపై హరీష్ ఆసక్తిగా ఉన్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తనపై జరుగుతోన్న ప్రచారాన్ని ఎన్నడూ లేనంత సీరియస్‌గా పట్టించుకోవడమే కాకుండా, అదేపనిగా ఖండించడం వెనుక, మీడియాకు వివరణ ఇవ్వడం వెనక, కేసీఆర్‌కి కరుడుకట్టిన కార్యకర్తనని పునరుద్ఘాటించడం వెనుక.. హరీష్‌ వ్యూహాత్మక ఆలోచన ఉందని, పార్టీలో తను కోల్పోయిన ప్రాధాన్యతను తిరిగి పునరుద్ధరించుకోవడం కోసం హరీష్ ఈ అడుగు వేశారని విశ్లేషకులు అంటున్నారు.

Also Read: Bhamalu Satya Bhamalu: రాజకీయం – సినిమా – అందాల పోటీలు.. అన్నీ ఒకే వేదికపై!

Gulabi Hari Ram Story: కేటీఆర్, హరీష్ మధ్య దూరం ఉందనే వార్తలు పదేపదే బయటకు రావడం, వీటిని పార్టీ నియంత్రించలేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాలు బీఆర్‌ఎస్‌లో అంతర్గత రాజకీయాలపై కొత్త చర్చలకు తెరతీస్తున్నాయి. ఈ పదేళ్ల కాలంలో ఎప్పటికప్పుడు ఈ అనుమానాలు ఎందుకు వెంటాడుతున్నాయి? నిప్పులేనిదే పొగరాదు. ఎవరూ ఉప్పందించకపోతే ఏదీ బైటకు రాదు. ఒకవేళ పుకార్లు పదేపదే వస్తున్నా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పదే పదే వివరణలు ఇవ్వాల్సిన పనిలేదు. రాజకీయాలలో ఏదీ లేదని పదే పదే అంటుంటే ఏదో ఉన్నట్లే.. అని అనుమానిస్తున్న వారు కూడా చాలా మందే ఉన్నారు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *