KNR Leaders Dual Rolls

KNR Leaders Dual Rolls: ఆ జిల్లాలలో కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షులు దొరకట్లేదా!

KNR Leaders Dual Rolls: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఆ నలుగురు నేతలు కీలక పాత్ర పోషించారు. జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తూ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటం సాగించారు. ఎమ్మెల్యేలుగా విజయం సాధించి ఇప్పుడు ప్రభుత్వంలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే, పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా ఇప్పటికీ జిల్లా అధ్యక్షులుగా వీరే కొనసాగుతుండటంతో పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెట్టలేకపోతున్నారనే చర్చ జరుగుతోంది. కరీంనగర్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా కవ్వంపల్లి సత్యనారాయణ, సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా ఆది శ్రీనివాస్, జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్, పెద్దపల్లి జిల్లా అధ్యక్షునిగా మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్‌ల గురించే ఈ చర్చంతా. ఆది శ్రీనివాస్ వేములవాడ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

ప్రభుత్వ విప్‌గా ఎన్నికయ్యారు. అదే విధంగా ధర్మపురి నుంచి ఆడ్లూరి లక్ష్మణ్ ఎమ్మెల్యేగా విజయం సాధించి ప్రభుత్వ విప్‌గా కొనసాగుతున్నారు. కరీంనగర్ డీసీసీ అధ్యక్షునిగా ఉన్న కవ్వంపల్లి సత్యనారాయణ మానకొండూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. పెద్దపల్లి జిల్లా డీసీసీ అధ్యక్షుడు రాజ్ ఠాకూర్ రామగుండం నుంచి గెలిచారు. ఈ నలుగురు నేతలు కూడా ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మరోవైపు ఇంకా జిల్లాకు కాంగ్రెస్‌ కొత్త అధ్యక్షులను నియమించలేదు. ఈ జోడు పదవుల కారణంగా ఈ నలుగురు జిల్లాలలో పార్టీకి సరియైన న్యాయం చేయడం లేదన్న టాక్‌ వినబడుతోంది.

ఈ నాలుగు జిల్లాలలో సమన్వయ లోపం స్పష్టంగా కనబడుతోంది. గ్రామస్థాయి, మండల స్థాయిలో పార్టీ కార్యక్రమాలు అంతంత మాత్రంగానే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మరింత స్తబ్ధుగా కనబడుతోంది. పార్టీ కార్యక్రమాలు కూడా నామమాత్రంగా కొనసాగుతున్నాయి. ఈ నలుగురు నేతలు వారి అసెంబ్లీ నియోజకవర్గాలకే పరిమితం అవుతున్నారు. గడచిన ఏడాది కాలంలో వారు పార్టీ కార్యక్రమాలకు హాజరైన సందర్భాలు వేళ్లపై లెక్కించవచ్చు. ఇందులో కవ్వంపల్లి సత్యనారాయణ ఒక్కరే కొంత పర్వాలేదు అనిపించుకుంటున్నారు.

Also Read: Knr Cong Leaders Fight: కరీంనగర్‌లో కాంగ్రెస్‌కు శత్రువులు అక్కర్లేదు!

KNR Leaders Dual Rolls: పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కరీంనగర్‌ జిల్లాకు చెందిన కీలక నేతలు దాదాపు రిలాక్స్ మోడ్‌లోకి వెళ్లారట. మండల స్థాయిలో పార్టీలో ఎదురవుతున్న సమస్యలను పట్టించుకునే నాధుడే కరువయ్యారట. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ద్వితీయ శ్రేణి నేతల్లో గుబులు స్టార్ట్ అయిందట. ప్రస్తుతం ఉన్న జిల్లా అధ్యక్షులకు ప్రభుత్వ కార్యక్రమాలకు, నియోజకవర్గ పరిధిలో తిరగడానికే సమయం చాలడం లేదు. ఈ పరిస్థితుల్లో సర్పంచ్, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు, ఆ తర్వాత వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలంటే పార్టీకి కొత్త జవసత్వాలు తేవాలని కోరుతున్నారు ద్వితీయ శ్రేణి నేతలు. ఇక, అధికార పార్టీ ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాల్లో పార్టీని నడిపించాలంటే ఫుల్ టైం పార్టీ కోసం పనిచేసే నేతలు అవసరం. కరీంనగర్, సిరిసిల్ల, హుజురాబాద్, కోరుట్ల నియోజకవర్గాల్లో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న నేపథ్యంలో అక్కడ పార్టీని నడిపించలేకపోతే పరిస్థితి గాడి తప్పే అవకాశాలు ఉన్నాయని సీనియర్స్ హెచ్చరిస్తున్నారట.

ఈ నాలుగు జిల్లాలలో కొత్త జిల్లా అధ్యక్షులను నియమించాలని కార్యకర్తలు కోరుతున్నారు. ఈ నలుగురు నేతలు పార్టీ పదవులను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, కొత్తవారిని నియమించే విషయంలో అధిష్ఠానం జాప్యం చేస్తోంది. జోడు పదవులు ఉన్న జిల్లాలలో పార్టీ కార్యక్రమాలు అనుకున్నంత స్థాయిలో వేగంగా ముందుకు వెళ్లడం లేదని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే రాబోయే కాలంలో ప్రతిపక్ష పార్టీలను ఎదుర్కోవడం ఎలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *