Secretariat Cast Politics : కుల రాజకీయాలు రాజకీయాల్లోనే కాదు, ఉద్యోగుల్లో సైతం ఉంటాయని నిరూపిస్తున్నారు తెలంగాణ సెక్రటేరియట్ ఉద్యోగులు. ఇప్పటికే పార్టీలతో అనుసంధానంగా సంఘాలను ఏర్పాటు చేసి రెండు, మూడు వర్గాలుగా విడిపోయిన ఉద్యోగులు ఇప్పుడు కులాల వారిగా విడిపోతున్నారు. భిన్నత్వంలో ఏకత్వంగా ఉండాల్సిన ఉద్యోగులు, సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన ఎంప్లాయీస్ కుల రాజకీయాలకు తెరలేపారు. తెలంగాణ సెక్రటేరియట్లో దాదాపు 2 వేలకు పైగా ఉద్యోగులు ఉన్నారు. ఇప్పటికే రెండు సంఘాలు ఉన్నాయి. అయితే కులాల పేరుమీద సంఘాలు లేవు. సెక్రటేరియట్లో ఎస్సీ, ఎస్టీ సంఘం ఉంది. అది వివక్ష పేరుతో ఎప్పుడో ఏర్పడిన సంఘం.
కానీ ఇప్పుడు తాజాగా బీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు జరిగింది. సంఘం ఏర్పాటుకు ముందు రెండు, మూడు సార్లు రహస్యంగా సమావేశాలను సైతం ఏర్పాటు చేసుకున్నారు. ఈ తెలంగాణ సెక్రటేరియట్ బీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడిగా టి. శేఖర్, అధ్యక్షుడిగా తిరందాస్ యాదగిరి ఎన్నికయ్యారు. గత వారం తెలంగాణ సచివాలయ బీసీ ఉద్యోగులందరూ సమావేశమై, బీసీ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో, బీసీ ఉద్యోగులంతా బీసీ రిజర్వేషన్లను 42%కి పెంచుతూ బిల్లును ఆమోదించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. అంతేకాక, ప్రభుత్వానికి సంఘీభావంగా నిలిచి, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేర్చడంలో తమ వంతు కృషి చేస్తామని, ఈ బాధ్యతను ప్రధానంగా నిర్వర్తిస్తామని తీర్మానించారు.
Secretariat Cast Politics: పదేళ్ల తర్వాత సెక్రటేరియట్ ఉద్యోగ సంఘ ఎన్నికలు జరిగాయి. ఈ సంఘం ఎన్నికల ప్రచారం కులాల వారిగా నిర్వహించారు ఆయా సంఘాల నాయకులు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సంఘంలో పోటీ చేసే నాయకులు ఓటర్లను కులాల వారిగా విభజించి పార్టీలు ఏర్పాటు చేశారు. ఇక ఒక సంఘం ఎన్నికలు జరిగినప్పుడు విమెన్ పోస్ట్‌కు పోటీ చేసిన అధికారి పోటీలో ఓడిపోయినట్లు ప్రకటిస్తే… ఆమె ఓటమిని ఒప్పుకోలేదు. తమ సామాజిక వర్గానికి చెందిన ఓట్లన్నీ తనకే పడ్డాయని, రీ-కౌంటింగ్ పెడితే అసలు విషయం బయటపడింది. ఇక ఇప్పటికే కులాల వారిగా వాట్సాప్ గ్రూప్‌లు సైతం ఉద్యోగులు మెయింటెన్ చేస్తున్నారట! ఎవరైనా ఉన్నతాధికారి వేధించినా, వృత్తిపరంగా ఇబ్బంది పెట్టినా ఆ వాట్సాప్ గ్రూప్‌లలో చర్చలు జరుపుతున్నారట సెక్రటేరియట్ ఉద్యోగులు.
Also Read: Duvvada Suspension Agenda: దువ్వాడ సస్పెన్షన్: వైసీపీలో గుసగుసలు!
ఇదివరకే ఎస్సీ, ఎస్టీ సంఘం ఉంది. ఇప్పుడు బీసీ ఉద్యోగుల కోసం మరో సంఘం ఏర్పాటు జరిగింది. ఉద్యోగులం అంతా ఒక్కటే అనే నినాదంతో తమ హక్కుల సాధన కోసం పోరాడాల్సిన ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు పెడితే తప్పులేదు కానీ, కులం, సామాజిక వర్గం పేరుతో సంఘాలు పెట్టడం ఏంటనే విమర్శలు వస్తున్నాయి. మరి ఇవి భవిష్యత్తులో కొనసాగుతాయా? లేదా ఆరంభంతోనే ఆగిపోతాయా అనేది చూడాలి.

