Kashmir: పహల్గామ్ దాడిలో ఉగ్రవాదులు అమానుషంగా ప్రవర్తించిన విధానం దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేపుతోంది. ఈ దాడిలో అనేక అసహ్యకరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. హెల్మెట్ మౌంటెడ్ కెమెరాలు ధరించి కాల్పుల దృశ్యాలను వీడియో తీయడం, టూరిస్టులను మతాల ఆధారంగా వేరు చేయడం, పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్పులు జరపడం వంటి దృశ్యాలు హృదయాన్ని కలచివేస్తున్నాయి.
ఈ దాడికి ముందు నుంచే పక్కా ప్రణాళిక ఉండిందని పోలీసులు భావిస్తున్నారు. హెల్మెట్ కెమెరాల ద్వారా రికార్డు చేసిన దృశ్యాలను పాకిస్తాన్లో ఉన్న తమ హ్యాండ్లర్లకు పంపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది కేవలం ఒక ఉగ్రదాడి కాదు, దేశాన్ని మతాల పేరుతో చించేందుకు చేసిన కుతంత్రంగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రయాణికులను ముందుగా మతాల వారీగా వేరు చేయడం ద్వారా ఈ దాడికి మతపరమైన అజెండా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈ దారుణ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. బాధిత కుటుంబాలకు న్యాయం జరగాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.