Road Accident: మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెంకట్రావుపేట గేటు వద్ద సోమవారం తెల్లవారుజామున రెండు కార్లు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ విషాద ఘటనలో ఏడాది వయస్సున్న చిన్నారి సహా ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు.
ప్రమాదానికి గురైన కార్లలో మొత్తం తొమ్మిది మంది ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రమాద తీవ్రతతో కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మృతులను ఎండీ గౌస్ (1), అలీ (45), అజీం బేగం (40)గా గుర్తించారు. మరికొందరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడగా, క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Crime News: దెయ్యం పోయింది… మాజీ డీజీపీ హత్య తర్వాత భార్య వీడియో కాల్ ఎవరికి చేసింది?
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టతకు రాలేదని అధికారులు తెలిపారు. అయితే, కార్ల అతివేగమే ప్రమాదానికి దారి తీసి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఘటన పట్ల స్థానికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, రోడ్డుపై వేగ పరిమితిని ఖచ్చితంగా పాటించాలంటూ వాహనదారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకే కుటుంబం నుంచి ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం. చిన్నారి మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.