Goshala Issue

Goshala Issue: మాజీ టీటీడీ ఛైర్మన్‌ హౌస్ అరెస్ట్

Goshala Issue: టీటీడీ గోశాలల్లో గోవుల మృతి వివాదం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణం వేడెక్కింది. అధికార టీడీపీ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఈరోజు (ఏప్రిల్ 17) గోశాలకు బయలుదేరే ప్రయత్నం చేశారు. అయితే, ఈ యాత్ర అనూహ్య మలుపులు తీసుకుంది.

ప్రారంభంలో భూమనకు గోశాలకు వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. కానీ, అనంతరం ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. దీనికి నిరసనగా భూమన నేలపై కూర్చొని నిరసన తెలిపారు. ఇదే సమయంలో ఆయన నివాసం వద్ద కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది.

ఇదే సమయంలో కూటమి ఎమ్మెల్యేలు శ్రీనివాసులు, పులవర్తి నాని, సుధీర్ రెడ్డి, మురళి, జగన్ మోహన్ రావులు అనుచరులతో కలిసి గోశాల వైపు వెళ్లడంతో అక్కడ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. దీనితో, గుంపులుగా రావొద్దని ఇప్పటికే ఇచ్చిన హెచ్చరికను గుర్తుచేస్తూ పోలీసులు తిరిగి జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.

ఇది కూడా చదవండి: Pawan Kalyan: తెగేదాకా లాగిన వైసీపీ… పవన్‌ ఎంట్రీ!

వైసీపీ నేతలు భూమనను హౌస్ అరెస్ట్ చేశారంటూ ఆరోపించగా, తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు దీనిని ఖండించారు. “భూమనకు గోశాలకు వెళ్లడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ రెండు పార్టీల నేతలు ఒకేసారి వెళ్లకుండా ఉండాలని సూచించాం,” అని ఎస్పీ తెలిపారు. ఆయన భద్రత కోసం వ్యక్తిగత సిబ్బంది తోడుగా ఉండాలని సూచించామని చెప్పారు.

ఈ క్రమంలో భూమన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తిరుమల అపవిత్రమవుతోందని, లడ్డూలపై తప్పుడు ప్రచారం, ఆలయంలో మద్యం బాటిళ్లు, చెప్పులతో ప్రవేశం, డ్రోన్ ప్రయోగాలు వంటి ఘటనలు జరగుతున్నాయని ఆరోపించారు. గోశాలలో ఆవులు చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. “ఇలాంటి తప్పులపై ప్రశ్నిస్తున్న మాకే కేసులు పెడతామని బెదిరిస్తున్నారు,” అని భూమన విమర్శించారు.

ఈ ఘటనతో తిరుమల గోశాల వివాదం మరోసారి రాజకీయంగా కేంద్రబిందువుగా మారింది. అధికార-ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కాస్తా చర్యల పరంగా కూడా మారిపోతుండగా, భద్రతా సమస్యలు అధికమవుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *