Telangana News: వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించ తలపెట్టిన బీఆర్ఎస్ సభకు పోలీసులు ఎట్టకేలకు అనుమతిని ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 ఏండ్లు అవుతున్న సందర్భంగా ఆ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని తలపెట్టింది. ఈ సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే స్థలాన్ని గుర్తించి, రైతుల నుంచి ఆ పార్టీ అనుమతి పత్రాలను తీసుకున్నది.
Telangana News: సుమారు 1200 ఎకరాల్లో మహాసభ, బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లను బీఆర్ఎస్ పార్టీ షురూ చేసింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాల వారీగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ సన్నాహక సమావేశాలను నిర్వహించారు. ఆ తర్వాత జిల్లాలు, నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ, ఆ పార్టీ క్యాడర్‌ను సమాయత్తం చేసే పనిలో పడింది.
Telangana News: ఈ దశలో బీఆర్ఎస్ బహిరంగ సభకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. అప్పటికే వరంగల్ సహా ఇతర కొన్ని జిల్లాల్లో పోలీస్ యాక్ట్‌ను అమలులోకి తేవడం కూడా గందరగోళానికి దారితీసింది. ఈ యాక్ట్ ద్వారా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించడం నిషేధం. నెలరోజుల పాటు అమలు చేస్తామని ప్రకటించారు. ఈ దశలో బీఆర్ఎస్ పార్టీ సభకు అనుమతి కోసం కోర్టు మెట్లెక్కింది.
Telangana News: రాష్ట్ర హైకోర్టులో నిన్న (ఏప్రిల్ 12)న విచారణ జరిగింది. అనుమతిపై ఎందుకు తాత్సారం చేస్తున్నారని ప్రభుత్వానికి, పోలీసులకు హైకోర్టు నోటీసులు పంపింది. ఈ నెల 17లోగా అనుమతిపై నిర్ణయం వెల్లడించాలని ఆదేశించింది. దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో కొంత ఊరట కలిగింది. కోర్టు ఆదేశాలతో ప్రభుత్వంలో కూడా కదలిక వచ్చినట్టయింది. ఎట్టకేలకు అనుమతిపై నిర్ణయం తీసుకున్నది.
Telangana News: ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ రజతోత్సవ సభకు అనుమతిని ఇస్తూ వరంగల్ జిల్లా పోలీసులు ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మేరకు వరంగల్ సీపీ ఆదేశాల మేరకు కాజీపేట రూరల్ ఏసీపీ ఆ ఉత్తర్వులను జారీచేశారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, వినయ్ భాస్కర్, ఒడితల సతీశ్‌కుమార్ పోలీసుల నుంచి అనుమతి పత్రాలను అందుకున్నారు. ఈ మేరకు హైకోర్టు వేసిన కేసును బీఆర్ఎస్ పార్టీ ఉపసంహరించుకున్నది.

