Cheteshwar Pujara: ఆస్ట్రేలియా పర్యటనకు తనను ప్రత్యామ్నాయంగా పరిగణించేలా టీమిండియా బ్యాటర్ ఛతేశ్వర్ పుజారా సెలక్టర్లకు గట్టి సంకేతాలు పంపించాడు. రంజీ ట్రోఫీ 2024-25 సీజన్లో సౌరాష్ట్రకు ప్రాతినిథ్యం వహిస్తున్న పుజారా.. రాజ్‌కోట్ వేదికగా ఛత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో చెలరేగాడు.
Cheteshwar Pujara: రంజీ సీజన్లో పుజారా సత్తా చూపాడు. సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్సులో 383 బంతుల్లో ఒక సిక్స్, 25 ఫోర్లతో 234 పరుగుల భారీ స్కోరు సాధించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో పుజారాకు ఇది 18వ డబుల్ సెంచరీ కావడం విశేషం. ఈ ఇన్నింగ్స్ తో ఛతేశ్వర్ మరో రికార్డు కూడా అందుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 27,000 పరుగుల మైలు రాయి చేరిన ప్లేయర్‌గా నిలిచాడు. న్యూజిలాండ్‌తో తొలి టెస్టు తొలి ఇన్నింగ్సులో టీమిండియా 46 పరుగులకే కుప్పకూలిన తర్వాత అజింక్య రహానే, చెతేశ్వర్ పుజారాల పేర్లు సోషల్ మీడియాలో ప్రతిధ్వనించాయి. ఈ నేపత్యంలో పుజారా బ్యాట్‌తో రాణించి మరోసారి సెలక్టర్లను అలోచనలో పడేశాడు.
Cheteshwar Pujara: 2023లో జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (2021-2023) ఫైనల్లో పేలవ ప్రదర్శనతో పూజారా జట్టులో చోటు కోల్పోయాడు. 2018-2019 బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా గడ్డపై భారత్ తొలిసారి సిరీస్ గెలవడంలో కీలకపాత్ర 36 ఏళ్ల పుజారాదే. తాజా డబుల్ సెంచరీ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో పుజారాకు 18 వది. ఈ ఇన్నింగ్స్ తో భారత్ తరఫున అత్యధిక డబుల్ సెంచరీలు ఆటగాడిగా పుజారా నిలిచాడు. అంతర్జాతీయంగా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన ఆటగాళ్లలో నాలుగో స్థానానికి చేరాడు. డాన్ బ్రాడ్ మన్ 37 డబుల్ సెంచరీలతో ఈ జాబితాలో ముందున్నాడు. వాలీ హామండ్ 36, పాట్సీ హెండ్రెన్ 22 డబుల్ సెంచరీలతో రెండు, మూడో స్థానాల్లో ఉన్నారు. తరువాతి స్థానం పుజారాదే. హెర్బర్ట్ సట్ క్లిఫ్, మార్క్ రాంప్రకాశ్ 17 డబుల్ సెంచరీలతో తరువాతి స్థానాల్లో ఉన్నారు. తాజాగా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సంచలన ఇన్నింగ్స్ ఆడిన పుజారాను అతడిని జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఆసీస్ సిరీస్ నవంబరు నుంచి ఆరంభం కానుంది.