Karnataka: కొన్ని సంఘటనలు చూస్తే ఏదో సినిమా కథలా అనిపిస్తుంది. సినిమాల్లో స్టోరీలు బయట జరుగుతాయా? బయట జరిగిన సంఘటనలే సినిమాలుగా వస్తాయా అనేది పెద్ద ప్రశ్నలా అనిపిస్తుంది. ఇదిగో అలాంటిదే ఒక సంఘటన జరిగింది. ఒక వ్యక్తిని తన భార్యను చంపాడని రిమాండ్ కు పంపించారు. అలా రిమాండ్ లో ఒకటి రెండూ కాదు ఏకంగా ఐదేళ్లు ఉన్నాడు. తరువాత అతనికి బెయిల్ వచ్చింది. జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. ఊరికి చేరుకున్న అతనికి తన భార్య ఎదురైంది. మీరు చదివింది నిజమే. తాను చంపేశానని చెబుతున్న వ్యక్తి ఎదురుగా కనిపిస్తే ఎలా ఉంటుంది? ఈ సంఘటన కర్ణాటకలో జరిగింది. ఆ స్టోరీ తెలుసుకుందాం.
కర్ణాటక రాష్ట్రం మైసూరులోని బసవనహళ్లి, కుశాల్ నగర్ కు చెందిన సురేష్, మల్లికే దంపతులు. వారికి 18 సంవత్సరాల క్రితం వివాహం అయింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. మల్లికే నవంబర్ 2020లో అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. చాలా చోట్ల వెతికినా ఆమె కనిపించకపోవడంతో, ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Karnataka: ఏడు నెలల తర్వాత, పెట్టహపుర ప్రాంతంలో ఒక మహిళ అస్థిపంజరం దొరికింది. ఆ అస్థిపంజరం మల్లికే అని చెప్పమని పోలీసులు సురేష్‌ను బెదిరించారు. అతని భార్యను చంపినట్లు ఒప్పుకోమని బలవంతం చేసి, అతన్ని జైలులో పెట్టారు. అప్పటినుంచి ఐదేళ్ల పాడు జైలులోనే మగ్గిపోయాడు సురేష్. ఇటీవల దొరికిన అస్థిపంజరం సురేష్ భార్యది కాదని జన్యు నివేదిక వెల్లడించింది. దీంతో సురేష్ కు బెయిల్ మంజూరైంది. జైలు నుంచి బయటకు వచ్చిన సురేష్ మొన్న ఏప్రిల్ 1న మడికేరిలోని ఒక హోటల్‌లో స్నేహితులతో కలిసి టీ తాగుతున్నాడు. అప్పుడు అతను దూరంగా ఒక స్త్రీని చూశాడు. ఆమె సుపరిచితురాలుగా కనిపించింది. వెంటనే దగ్గరగా వెళ్లి చూసిన అతను షాక్ అయ్యాడు. ఎందుకంటే, ఆమె తన భార్య మల్లికే. దీంతో ఆమెను అసలు విషయం ఏమిటని అడిగాడు సురేష్. ఐదేళ్ల క్రితం తానూ వేరే వివాహం చేసుకుని విరాజ్ పేట లోని శెట్టిగెరై అనే ప్రాంతంలో నివసిస్తున్నట్టు వెల్లడించింది.
Also Read: Madhya Pradesh: విషాదం: పండగ కోసం బావిని శుభ్రం చేస్తుండగా 8 మంది మృతి!
Karnataka: దీంతో ఏడవాలో నవ్వాలో అర్ధం కానీ సురేష్.. పోలీసుల దగ్గరకు పరుగులు తీశాడు. పోలీసులు అతన్ని మైసూరు ఐదవ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు ముందు హాజరుపరిచారు. “ఈ కేసుపై దర్యాప్తు నిర్వహించి నివేదిక సమర్పించాలి.” అలాగే మల్లికేకు పోలీసు రక్షణ కల్పించాలని కూడా కోర్టు పోలీసులను ఆదేశించింది. ఈ సంఘటన కారణంగా సురేష్ ఎలాంటి తప్పు చేయకుండా నాలుగున్నర సంవత్సరాలు జైలు జీవితం గడిపాడని వెల్లడైంది. ఈ సంఘటన ప్రస్తుతం ఆ ప్రాంతంలో సంచలనంగా మారింది.