ఆదివారం జమ్మూకశ్మీర్‌లోని గందర్‌బల్ జిల్లాలోని గగాంగీర్ ప్రాంతంలో ఉగ్రవాదులు స్థానికేతరులపై దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. వీరంతా సొరంగం ప్రాజెక్టులో పనిచేస్తున్నారు. చనిపోయిన కార్మికులు మెగా కంపెనీకి చెందిన ప్రాజెక్టులో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన ప్రాంతం మెగా కంపెనీ ఆధ్వర్యంలో జరుగుతున్న సొరంగ మార్గం పక్కనే ఉంది
దాడి జరిగిన వెంటనే భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. దాడి చేసిన వారిని వీలైనంత త్వరగా పట్టుకునేందుకు వీలుగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా విచారం వ్యక్తం చేశారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఒమర్ అబ్దుల్లా గందర్‌బల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు..
అంతకుముందు అక్టోబర్ 16న షోపియాన్‌లో ఉగ్రవాదులు స్థానికేతర యువకుడిని కాల్చి చంపారు.