TDP Formation Day

TDP Formation Day: నేడు టీడీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం.. వేడుకల్లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు

TDP Formation Day: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుపుకోవడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొనడానికి సిద్ధమవుతున్నాయి. నేటి ఉదయం టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌కు వెళ్లి కార్యకర్తలతో భేటీ కానున్నారు. అనంతరం పార్టీ జెండాను ఎగురవేసి, మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో జరిగే వేడుకల్లో మంత్రి నారా లోకేశ్, ఇతర ముఖ్య నాయకులతో కలిసి పాల్గొంటారు.

తెలుగుదేశం పార్టీ స్థాపన – ఒక చరిత్ర

1982 మార్చి 29న దివంగత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) తెలుగుదేశం పార్టీని స్థాపించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడే లక్ష్యంతో ప్రారంభమైన ఈ పార్టీ, పేదలు, రైతులు, మధ్య తరగతి వర్గాల అభివృద్ధికి కృషి చేస్తూ ఐదు పర్యాయాలు అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఆవిర్భవించిన టీడీపీ, 43 ఏళ్ల ప్రస్థానంలో ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత విజయవంతమైన రాజకీయ పార్టీగా పేరు పొందింది. ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర పాలనను కొనసాగిస్తోంది.

వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణలు

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 9 గంటలకు వేడుకలు అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. చంద్రబాబు పార్టీ జెండాను ఆవిష్కరించి, ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి వేడుకలను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస యాదవ్, పలువురు పొలిట్‌బ్యూరో సభ్యులు, ప్రజా ప్రతినిధులు, సీనియర్ నేతలు పాల్గొననున్నారు. జిల్లాలవారీగా ఎన్టీఆర్ విజయప్రస్థానం, చంద్రబాబు నాయుడు పాలనలో సాధించిన విజయాలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించాలని పార్టీ నాయకత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఇది కూడా చదవండి: Snake Bite: 10వ తరగతి పరీక్ష జరుగుతుండగా వచ్చిన పాము.. డ్యూటీలో ఉన్న అధికారిని కాటేసిన పాము

ఎన్టీఆర్ హయాంలో సంక్షేమ పాలన

ఎన్టీఆర్ పాలనలో పేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలయ్యాయి. రూ.2కే కిలో బియ్యం, జనతా వస్త్రాలు, పేదలకు పక్కా ఇళ్లు, మహిళలకు ఆస్తి హక్కు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 20% రిజర్వేషన్, విద్యా, ఉద్యోగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్ వంటి ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టారు. మైనారిటీల అభివృద్ధికి ప్రత్యేకంగా మైనారిటీ కార్పొరేషన్‌ను 1985లో స్థాపించారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు తొలిసారిగా పింఛన్లు ప్రవేశపెట్టిన ఘనత టీడీపీదే.

నవ్యాంధ్ర నిర్మాణంలో టీడీపీ పాత్ర

రాష్ట్ర విభజన అనంతరం ఆర్థికంగా బలహీనమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా ప్రకటించి, నవ్యాంధ్ర నిర్మాణానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. తిరుపతిలో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌లో పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ, విజయవాడలో ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వంటి విద్యాసంస్థలు టీడీపీ హయాంలో స్థాపించబడ్డాయి. తిరుమలలో భక్తుల వసతుల కల్పన కూడా ఎన్టీఆర్ నుంచే ప్రారంభమైంది.

భవిష్యత్తుపై టీడీపీ లక్ష్యాలు

తెలుగుదేశం పార్టీ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అభివృద్ధి దిశగా పయనిస్తోంది. పార్టీ నేతలు, కార్యకర్తలు 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నూతన శక్తితో ముందుకు సాగాలని సంకల్పం చేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ తెలుగుజాతి ఆశాదీపంగా కొనసాగుతుందని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *