Telangana assembly:తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తన ప్రసంగంలో కీలకాంశాలను ప్రస్తావించారు. ఉభయ సభలను ఉద్దేశించిన ప్రసంగించిన గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. తెలంగాణ ప్రజల కలల సాకారానికే ఈ బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్టు ఆయన ప్రకటించారు. రాష్ట్రంలోని రైతులందరినీ శక్తిమంతులను చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు.
Telangana assembly:రైతులకు మద్దతుగా ప్రభుత్వం నిలుస్తుందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రకటించారు. దేశంలోనే ధాన్యం పండిస్తున్న రాష్ట్రంగా తెలంగాణకు గుర్తింపు వచ్చిందని చెప్పారు. రైతులకు రుణమాఫీ చేశామని, ఇది రైతుల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. 23.35 లక్షల మంది రైతులకు ప్రయోజనం కల్పించామని వివరించారు. ఎకరానికి రూ.12 వేల చొప్పున రైతులకు అందిస్తున్నామని, రైతునేస్తం అమలు చేస్తున్నామని గవర్నర్ తన ప్రసంగంలో వివరించారు.
Telangana assembly:మా ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నదని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చెప్పారు. అన్నివర్గాల అభ్యున్నతే లక్ష్యమని, రైతులతోపాటు మహిళలు, యువతకు అన్నివిధాలా సహకారం అందిస్తామని, రైతుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. వరి పంటకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తున్నామని, అన్నదాతల కోసం వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేశామని తెలిపారు. అభివృద్ధి, ప్రగతి వైపు తెలంగాణ అడుగులు వేస్తున్నదని తెలిపారు.
Telangana assembly:ఘనమైన సంస్కృతికి నిలయమైన తెలంగాణ అని గవర్నర్ పేర్కొన్నారు. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించుకున్నామని చెప్పారు. ప్రజల కోసం గద్దర్, అంజయ్య వంటి ఎందరో కృషి చేశారని కొనియాడారు. జననీ జయకేతనం రాష్ట్ర గీతంగా చేసుకున్నామని, సామాజిక న్యాయం అమలుకు, అభివృద్ధికి సర్కారు కట్టుబడి ఉన్నదని చెప్పారు. మహాలక్ష్మి పథకం గేమ్‌చేంజర్‌గా మారిందని గవర్నర్ తన ప్రసంగంలో కొనియాడారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం దానికి నిదర్శనమని పేర్కొన్నారు.