Hyderabad: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబు, ఆయన కుమారుడు మంచు విష్ణు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని శాలువాతో సన్మానించి, తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.
ఈ భేటీకి సంబంధించిన ఫొటోలను మంచు విష్ణు తన ‘ఎక్స్’ (మాజి ట్విట్టర్) ఖాతాలో పంచుకున్నారు. ముఖ్యమంత్రిని కలిసే అవకాశం లభించడం ఎంతో ఆనందంగా ఉందని, సినీ పరిశ్రమ అభివృద్ధిపై ఆయన చూపిస్తున్న చొరవ, నిబద్ధత ప్రశంసనీయమని తెలిపారు. తెలుగు చలనచిత్ర రంగం పురోగమించేందుకు సీఎం రేవంత్ రెడ్డి అందిస్తున్న మద్దతుకు కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు కలిసి పనిచేసే అవకాశం లభించాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

