AP High Court: రాంగోపాల్ వర్మ కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తాత్కాలిక ఉపశమనం లభించింది. “కమ్మ రాజ్యంలో కడప రెడ్లు” సినిమాతో కుల వివాదాలను రెచ్చగొట్టారని, మార్ఫింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేశారనే ఆరోపణలపై CID పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఈ కేసును కొట్టివేయాలని వర్మ హైకోర్టును ఆశ్రయించగా, విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆరువారాల పాటు పోలీసు చర్యలను నిలిపివేస్తూ తదుపరి విచారణను ఏప్రిల్ 17కి వాయిదా వేసింది.
రాంగోపాల్ వర్మ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలను మార్ఫింగ్ చేసి ఎక్స్ (Twitter) లో పోస్ట్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో గతేడాది నవంబర్ 10న కేసు నమోదైంది. నవంబర్ 19, 25 తేదీల్లో వర్మను విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపినప్పటికీ, ఆయన స్పందించలేదు.
Also Read: Rahul Gandhi: రాహుల్ గాంధీకి 200 రూపాయల ఫైన్.. ఎందుకంటే..
AP High Court: పోలీసుల విచారణను నివారించేందుకు కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్లిన వర్మ, చివరకు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో పాటు, పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశించింది. అయితే, వర్మ పలుమార్లు విచారణకు హాజరు కాకుండా డుమ్మా కొట్టారు.
తాజాగా, ఫిబ్రవరి 4న సీఐ శ్రీకాంత్ “ఫిబ్రవరి 7న విచారణకు హాజరు కావాలని” నోటీసులు పంపారు. వీటిపై స్పందించిన వర్మ, వచ్చేలా ఉన్నట్లు పోలీసులు భావించగా, ఫిబ్రవరి 7న ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు.
హైకోర్టు ఈ కేసులో అంతిమ నిర్ణయం ఇంకా ప్రకటించలేదు. ఏప్రిల్ 17న తదుపరి విచారణ జరుగనుంది. ప్రస్తుతం రాంగోపాల్ వర్మకు తాత్కాలిక ఊరట లభించినా, ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.