Sirimanotsavam

Sirimanotsavam: వైభవంగా విజయనగరం పైడిమాంబ అమ్మవారి సిరిమానోత్సవం

Sirimanotsavam: ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సంప్రదాయానుసారం పాలధార, తెల్ల ఏనుగు, అంజలిరధం, బెస్తవారి వల ముందు నడవగా అమ్మవారి సిరిమాను ముమ్మార్లు పురవీధుల్లో ఊరేగింది. సిరిమాను రూపంలో పైడితల్లి అమ్మవారు తన పుట్టినిల్లు అయిన కోట వద్దకు వెళ్లి రాజ కుటుంబాన్ని, ఉత్సవానికి హాజరైన అశేష జన వాహినిని ఆశీర్వదించారు. ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకట్రావు అమ్మవారికి ప్రతిరూపంగా సిరిమాను అధిరోహించి భక్తులకు ఆశీస్సులు అందించారు. సిరిమాను రధం నడక మధ్యాహ్నం 3.43 గంటలకు ప్రారంభమై, సాయంత్రం 5.30 గంటలకు ముగిసింది. ఈ అపూర్వ ఘట్టాన్ని లక్షలాదిమంది భక్తులు తిలకించి పరవశించిపోయారు. పైడిమాంబకు భక్తులు జేజేలు పలికారు.

Sirimanotsavam: రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్నారై వ్యవహారాల శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపి కలిశెట్టి అప్పలనాయుడు సిరిమాను రధం వెంట ఉండి ఆద్యంతమూ నడిపించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ…. ఎప్పటికప్పుడు సిబ్బందికి ఆదేశాలను జారీ చేస్తూ, ఉత్సవాన్ని సకాలంలో పూర్తి చేయడానికి కృషి చేసారు.
Sirimanotsavam: అమ్మవారి సిరిమానోత్సవాన్ని పూసపాటి వంశీయులు, పైడితల్లి ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతి రాజు, ఎంఎల్ఏ అదితి విజయలక్ష్మి గజపతిరాజు, సుధా గజపతి, ఊర్మిళగజపతి, ఇతర రాజ కుటుంబీకులు ఎప్పటిలాగే కోట బురుజు పైనుంచి తిలకించారు. వీరితోపాటు మంత్రి గుమ్మడి సంధ్యారాణి, విశాఖ ఎంపి భరత్, నెల్లిమర్ల ఎంఎల్ఏ లోకం నాగమాధవి, ఉండి ఎంఎల్ఏ ఆర్.రఘురామకృష్ణరాజుతదితర ప్రముఖులు సిరిమానోత్సవాన్ని వీక్షించారు. రాష్ట్ర శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తమ కుటుంబంతో కలిసి డిసిసిబి వద్ద ఆసీనులై ఉత్సవాన్ని తిలకించారు.

జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, ఇతర పోలీసు అధికారులు బందోబస్తు ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. జిల్లా యంత్రాంగం కృషి ఫలితంగా సిరిమానోత్సవం అత్యంత ఘనంగా, సంప్రదాయ బద్దంగా, ప్రశాంతంగా పూర్తయింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *