ఢిల్లీ: ఉచిత హామీలపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు.. కేంద్ర ప్రభుత్వానికి, భారత ఎన్నికల సంఘానికి(ఈసీఐ)కి నోటీసులు ఇచ్చింది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీలపై సుప్రీంకోర్టులో బెంగళూరుకు చెందిన ఓ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచితాల హామీలను లంచాలుగా పరిగణించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.
రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు ఉచిత వాగ్దానాలు చేయకుండా నిరోధించడానికి చర్యలు తీసుకునేలా పోల్ ప్యానెల్‌ను ఆదేశించాలని అందులో కోరారు. ఈ ఉచితాల కారణంగా ప్రభుత్వ ఖజానాపై అధిక భారం పడుతుందని అభ్యర్థనలో వెల్లడించారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌ను పరిశీలించింది. ఇదే అంశంపై పెడింగ్‌లో ఉన్న పలు కేసులతో కలిపి దీన్ని విచారించాలని సుప్రీం నిర్ణయించింది.
ఈ క్రమంలోనే కేంద్రానికి, ఈసీకి నోటీసులు జారీ చేసింది. పిటిషనర్ తరఫు న్యాయవాది విజయ్ హన్సారియా ఈ అంశంపై అత్యవసర విచారణ జరపాలని కోరారు. అదేవిధంగా ఎన్నికల ముందు ఉచిత వాగ్దానాలు.. ఎన్నికల ప్రక్రియ స్వచ్ఛతను దెబ్బతీస్తున్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.