Rohit Sharma: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టులో ఐదుగురు స్పిన్నర్లకు చోటు ఇచ్చారని వచ్చిన విమర్శలపై టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్రంగా స్పందించారు. జట్టులో నిజానికి ఇద్దరు స్పిన్నర్లు మాత్రమే ఉన్నారని, ముగ్గురు ఆల్‌రౌండర్లు ఉన్నారని స్పష్టం చేశారు. బ్యాటింగ్ డెప్త్ కోసం వారిని ఎంపిక చేశామని, ఇతర జట్లు ఆరుగురు పేసర్లను తీసుకున్నప్పుడు వారిని ఎందుకు విమర్శించరని అనుమానం వ్యక్తం చేశారు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు మ్యాచ్‌లు దుబాయ్ వేదికపై జరగనున్నాయి. ఇప్పటికే అక్కడికి చేరుకున్న టీమ్ ఇండియా గత ఐదు రోజులుగా తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తోంది. గురువారం బంగ్లాదేశ్‌తో భారత జట్టు తమ మొదటి మ్యాచ్‌ను ఆడనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో బుధవారం మీడియా సమావేశంలో పాల్గొన్న రోహిత్ శర్మ, జట్టు ఎంపికపై వచ్చిన విమర్శలపై స్పందించారు. తమ బలాలను బట్టి జట్టును ఎంపిక చేశామని స్పష్టం చేశారు.
జట్టులో ఇద్దరు స్పిన్నర్లు మాత్రమే ఉన్నారు. ముగ్గురు ఆల్‌రౌండర్లు కూడా ఉన్నారు. నేను వారిని ఐదుగురు స్పిన్నర్లుగా చూడటం లేదు. ముగ్గురు ఆల్‌రౌండర్లు బంతితో పాటు బ్యాట్‌తో కూడా బాగా ఆడగలరు. ఇతర జట్లు ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్లతో ఆడుతున్నాయి. కానీ మీరు వారిని ఆరుగురు పేసర్లతో ఎందుకు ఆడుతున్నారని అడగడం లేదు అంటూ రోహిత్ ఫైర్ అయ్యాడు..!
ఇది కూడా చదవండి: WPL 2025: లో దిల్లీ రెండో విజయం..! యూపీ కొంపముంచిన క్యాచ్ డ్రాప్
మేము మా బలాలపై దృష్టి పెట్టాము. అందుకు తగినట్లుగా జట్టును ఎంపిక చేశాము. అక్షర్ పటేల్ మరియు వాషింగ్టన్ సుందర్ మా జట్టుకు కొత్త సానుకూలత ఇస్తారు. వారితో మా బ్యాటింగ్ డెప్త్ పెరిగింది. అందుకే మేము బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ చేసే నైపుణ్యం కలిగిన ఆటగాళ్లను ఎంచుకున్నాము అని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడమే తమ లక్ష్యమని రోహిత్ శర్మ తెలిపాడు. సుమారు 8 ఏళ్ల తర్వాత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతోంది. ప్రతి ఐసీసీ టోర్నమెంట్ మాకు ముఖ్యమైనదే అని…. టైటిల్ గెలవడానికే ఇక్కడికి వచ్చామని చెప్పాడు. ప్రస్తుతం మా దృష్టి అంతా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌పైనే ఉంది…. ఈ టోర్నమెంట్‌ను విజయంతో ప్రారంభించాలనుకుంటున్నాం కానీ మాపై ఎలాంటి ఒత్తిడి లేదు. జట్టులోని ప్రతి ఆటగాడికి తన బాధ్యతలపై స్పష్టత ఉంది అని అన్నాడు.
గతంలో భారత్ తరఫున ఎలా ఆడామో, ఈ టోర్నమెంట్‌లో కూడా అలానే ఆడుతాం అన్నాడు ఈ ఇండియన్ కెప్టెన్. ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో మా యువకులు అద్భుతంగా ప్రదర్శన ఇచ్చారు. గతంలో దుబాయ్ వేదికపై మేం చాలా క్రికెట్ ఆడాం. పిచ్ కండిషన్స్‌ను వీలైనంత త్వరగా అంచనా వేయడం కీలకం. పరిస్థితులను బట్టి ప్రణాళికలను మార్చుకోవాల్సి ఉంటుంది. బంగ్లాదేశ్‌ను ఏ మాత్రం తేలికగా తీసుకోవడం లేదు అని రోహిత్ శర్మ వివరించారు.