Bandi sanjay: కేంద్రమంత్రి బండి సంజయ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను చర్చకు దారితీశాయి. దేశంలో విద్యా వ్యవస్థ అర్బన్ నక్సల్స్ చేతిలో బందీ అయ్యిందని, కొందరు విద్యార్థులను తుపాకులు పట్టేలా ప్రేరేపిస్తూ, కొత్తగా కొండపల్లి సీతారామయ్యలు, చంద్రపుల్లారెడ్డిలను తయారు చేయాలని చూస్తున్నారని విమర్శించారు.
విద్యా వ్యవస్థపై ఘాటు విమర్శలు
దేశ భవిష్యత్తు అయిన విద్యార్థులను పటేల్, అంబేద్కర్, ఛత్రపతిలా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, అందుకే నూతన విద్యా విధానాన్ని తీసుకువచ్చామని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును తుపాకుల వైపు నడిపించాలని కొందరు భావిస్తే, తమ ప్రభుత్వం మాత్రం కలం పట్టేలా చేయడానికి కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
గన్నుల రాజ్యమా.. పెన్నుల రాజ్యమా?
విద్యా వ్యవస్థను కొందరు గన్నుల రాజ్యంగా మార్చాలని చూస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. విద్యార్థులను నక్సల్ సిద్ధాంతాల వైపు మళ్లించేందుకు కొందరు కుట్రలు పన్నుతున్నారని, అయితే దేశానికి పెన్నుల రాజ్యం కావాలా? గన్నుల రాజ్యం కావాలా? అన్నది ప్రజల నిర్ణయమని అన్నారు.
వివాదాస్పద వ్యాఖ్యలపై విమర్శలు
బండి సంజయ్ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందించాయి. విద్యార్థులపై రాజకీయ ఆరోపణలు చేయడం తగదని, నూతన విద్యా విధానానికి వ్యతిరేకంగా ఎవరు ప్రచారం చేసినా, అది ప్రజాస్వామ్య విధానాల్లో చర్చించాల్సిన అంశమని విపక్ష నేతలు పేర్కొన్నారు.

