PM modi: కాంగ్రెస్ జీరో హ్యాట్రిక్ కొట్టింది..

PM modi: ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన దేశ ప్రజలకు, ముఖ్యంగా ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఆప్‌కు ఢిల్లీ ప్రజల గుడ్‌బై

ప్రధాని మోదీ మాట్లాడుతూ, “ఢిల్లీ ప్రజలకు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నుంచి విముక్తి లభించింది. ఇది ఢిల్లీ ప్రజలకు పండుగలాంటిది. మాపై విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మీ విశ్వాసాన్ని అభివృద్ధి రూపంలో తీసుకువస్తాం,” అని తెలిపారు.

పూర్వాంచల్ ఓటర్లకు ప్రత్యేక ధన్యవాదాలు

పూర్వాంచల్ ఓటర్లకు ప్రత్యేక ధన్యవాదాలు చెబుతూ మోదీ, “నేను పూర్వాంచల్ నుంచి ఎంపీగా ఉన్నందుకు గర్వపడుతున్నాను. దేశ ప్రజలు ఎన్డీయేపై పూర్తి విశ్వాసం కలిగి ఉన్నారు. చాలా రాష్ట్రాల్లో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చింది. నిజమైన అభివృద్ధిని ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో చూడొచ్చు. బీహార్‌లో నితీశ్, ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబుతో కలిసి ఘన విజయాన్ని సాధించాం. చంద్రబాబు తన ట్రాక్ రికార్డును నిరూపించుకున్నారు,” అని చెప్పారు.

మహిళల సంక్షేమానికి మోదీ హామీ

“కోట్లాది మంది మహిళలు ఎన్డీయే ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందుతున్నారు. మోదీ గ్యారెంటీ అంటే, అది నెరవేరి తీరుతుంది. ఢిల్లీనీ అత్యున్నత నగరంగా తీర్చిదిద్దుతాం. ఢిల్లీ భారత్‌కు ముఖద్వారం,” అని మోదీ స్పష్టం చేశారు.

కాంగ్రెస్ ఓటమిపై సెటైర్లు

కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో మూడోసారి కూడా ఓటమిపాలై ‘జీరో హ్యాట్రిక్’ కొట్టిందని మోదీ వ్యాఖ్యానించారు. “ఓటముల విషయంలో కాంగ్రెస్‌కు గోల్డ్ మెడల్ ఇవ్వొచ్చు. కాంగ్రెస్ మునిగిపోవడమే కాకుండా, వారి మిత్రులను కూడా ముంచేస్తోంది. ఇండి కూటమి పార్టీలకు కాంగ్రెస్ నిజస్వరూపం అర్థమైంది. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలను వారి మిత్రులు కూడా గ్రహించారు,” అని అన్నారు.

యమునా నదిని రక్షిస్తాం

ఢిల్లీని వాయు కాలుష్యం, పారిశుద్ధ్య సమస్యలు తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. “ఆప్ ప్రభుత్వం హర్యానాపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, యమునా నదిని అపవిత్రం చేసింది. కాలుష్య కోరల నుంచి యమునా నదిని రక్షించడానికి కట్టుబడి ఉన్నాం. ఎంత కష్టమైనా యమునాను శుభ్రం చేసి తీరుతాం,” అని ఆయన హామీ ఇచ్చారు.

అవినీతికి వ్యతిరేకంగా కఠిన చర్యలు

అన్నా హజారే అవినీతికి వ్యతిరేకంగా పోరాడారని, కానీ అవినీతి వ్యతిరేక పార్టీగా ప్రారంభమైన AAP చివరికి అవినీతిలో కూరుకుపోయిందని మోదీ అన్నారు. “ఢిల్లీ తొలి అసెంబ్లీ సమావేశంలోనే కాగ్ రిపోర్ట్‌ను ప్రవేశపెడతాం,” అని ఆయన స్పష్టం చేశారు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *