Gold Price: బంగారం తొలిసారి రూ.81 వేలు దాటింది. జనవరి 30న 10 గ్రాముల బంగారం ధర రూ.81,010కి చేరింది. డిసెంబర్ 31, 2024న 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.76,162. అంటే గత 30 రోజుల్లో రూ.4,848 పెరిగింది. బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నారు. బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. దానికి చాలా కారణాలుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ ధరల ప్రభావం ఒక ముఖ్య కారణంగా ఉంటుంది. అలాగే రెండో అతిపెద్ద కారణం యూనియన్ బడ్జెట్. బడ్జెట్ వచ్చిన ప్రతిసారి బంగారం ధరలపై ఎఫెక్ట్ పడుతుంది. ఒక్కోసారి పెరగవచ్చు.. లేదా తగ్గవచ్చు. అది బడ్జెట్ లో వచ్చే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. బంగారంపై కస్టమ్ డ్యూటీని పెంచడం లేదా తగ్గించడం డైరెక్ట్ గా బంగారం ధరలపై ప్రభావాన్ని చూపిస్తుంది. అలాగే బడ్జెట్ లోని చాలా ఇతర అంశాలు బంగారం ధరలపై పరోక్షంగా ప్రభావం చూపించడం జరుగుతుంది.
ఈ బడ్జెట్ లో బంగారం ధర పెరుగుతుందా?
గతేడాది బడ్జెట్‌ను ఒకసారి గుర్తు చేసుకుందాం.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బంగారంపై కస్టమ్ డ్యూటీని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించారు. ఆ తర్వాత వెంటనే బంగారం ధరలు 10 గ్రాములకు దాదాపు రూ.4 వేలు తగ్గాయి. దీంతో దేశంలో బంగారం దిగుమతులు వేగంగా పెరగడం ప్రారంభమైంది. ప్రస్తుతం ఆర్థిక నిపుణుల అంచనాల ప్రకారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025 బడ్జెట్లో బంగారం, వెండిపై కస్టమ్ సుంకాన్ని పెంచవచ్చు. దీనికి రెండు పెద్ద కారణాలు ఉన్నాయి…
1. రెవెన్యూ అవసరం: కంట్రోలర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ (CGDA) నివేదిక ప్రకారం, ఏప్రిల్ నుండి నవంబర్ మధ్య కాలంలో ప్రభుత్వ ద్రవ్య లోటు దాదాపు రూ. 8.5 లక్షల కోట్లుగా ఉంది. అంటే ప్రభుత్వ ఆదాయానికి, వ్యయానికి మధ్య అంతరం పెరిగింది. ఈ లోటు నుంచి బయటపడాలంటే ప్రభుత్వానికి ఆదాయం కావాలి. అటువంటి పరిస్థితిలో, బంగారంపై కస్టమ్ డ్యూటీని పెంచవచ్చు, ఇది ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుతుంది.
2. బంగారం కోసం దేశీయ డిమాండ్‌ను నియంత్రించడం: భారతదేశంలో బంగారం వినియోగం చాలా ఎక్కువ. ఇది చెల్లింపు లోటు (కరెంట్ అకౌంట్ డెఫిసిట్) ను పెంచవచ్చు. అంటే మనం ఇతర దేశాలకు విక్రయించే దానికంటే ఎక్కువ వస్తువులను కొనుగోలు చేస్తున్నాం. బంగారం దిగుమతులను ఖరీదైనదిగా చేయడం ద్వారా ప్రభుత్వం దాని వినియోగాన్ని నియంత్రించడానికి ప్రయత్నించవచ్చు.
ఇది కూడా చదవండి: Nara Lokesh: ఏపీలో విద్యా ప్రమాణాల దిగజారింపు – అసర్ నివేదికపై మంత్రి లోకేశ్ స్పందన
బడ్జెట్లో కస్టమ్ డ్యూటీని 6% నుంచి 12%కి పెంచితే బంగారం ధరలు 10 గ్రాములకు రూ.4 నుంచి 5 వేల వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అయితే, ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో బంగారంపై కస్టమ్స్ సుంకాన్ని పెంచే ఆలోచన చేయకపోవచ్చని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.