Sharmila: వైసీపీ సీనియర్ నాయకుడు విజయసాయి రెడ్డి రాజీనామా పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా స్పందించారు. విజయసాయి రెడ్డి రాజీనామా చిన్న విషయం కాదని, అది రాజకీయ దృష్టిలో ఎంతో కీలకమని ఆమె పేర్కొన్నారు.
జగన్ నాయకత్వంపై విమర్శలు
వైఎస్ షర్మిల, విజయసాయి రెడ్డిని కాపాడుకోవడానికి జగన్ ఆయనను బీజేపీలోకి పంపిస్తున్నారని ఆరోపించారు. జగన్ వారికి ఏది ఆదేశిస్తే ఆ పని చేస్తూ, ఎవరినీ తిట్టమన్నా వారిని తిట్టేవాడని ఆమె ఆరోపించారు. రాజకీయంగా మాత్రమే కాకుండా, వ్యక్తిగతంగా కూడా తన పిల్లల విషయంలో అబద్ధాలు చెప్పిన వ్యక్తి విజయసాయి రెడ్డి అని షర్మిల విమర్శించారు.
వైఎస్ షర్మిల, జగన్ సన్నిహితులు ఒక్కొక్కరుగా ఎందుకు బయటకు వెళ్ళిపోతున్నారు అని ప్రశ్నించారు. “ప్రాణం పెట్టిన వాళ్లు ఎందుకు జగన్‌ను వీడుతున్నారు?” అని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. జగన్ నాయకుడిగా విశ్వసనీయత కోల్పోయారని, ప్రజలను మోసం చేశారని అన్నారు.
విజయసాయి రెడ్డి విషయాలు బయటపెట్టాలని డిమాండ్
విజయసాయి రెడ్డి గతంలో చెప్పిన విషయాలు అబద్ధాలు అని షర్మిల తెలిపారు. వైఎస్ వివేకా హత్య విషయంలో సత్యం చెప్పినందుకు సంతోషంగా ఉన్నట్లు ఆమె చెప్పారు. మిగతా విషయాలు కూడా బయటపెట్టాలని ఆమె డిమాండ్ చేశారు.