South Africa:దక్షిణాఫ్రికా దేశంలో పెను విషాదం చోటుచేసుకున్నది. నెలల తరబడి అక్రమ బంగారు మైనింగ్ తవ్వకాల్లో పాల్గొన్న కార్మికులు వందలాది మంది గల్లంతయ్యారు. వీరిలో సుమారు 100 మంది మంది వరకు చనిపోయారని అధికారులు గుర్తించారు. ఇంకా గల్లంతైన వారి వివరాలు తేలితే మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలిపారు. వారంతా ఆకలి, డీ హైడ్రేషన్ కారణంగా చనిపోయి ఉంటారని భావిస్తున్నారు.
South Africa:దక్షిణాఫ్రికాలోని వాయువ్య ప్రావిన్స్‌లోని బంగారు గనుల్లో తవ్వకాలు చేపట్టేందుకు వెళ్లిన వందలాది మంది కార్మికులు ఆ గనిలో చిక్కుకున్నారు. తొలుత గనిలో చిక్కుక్కున్న వారిని రక్షించేందుకు దక్షిణాఫ్రికా ప్రభుత్వం ముందుకురాకపోవడంతో పౌర సంఘాలు ఒత్తిడి చేశాయి. దీంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. దీనిలో భాగంగా ఓ క్రేన్‌ను రంగంలోకి దింపింది. కొన్ని నెలలుగా కార్మికులు అందులోనే చిక్కుకుపోవడంతో ఆకలి, డీ హైడ్రేషన్‌తో ప్రాణాలొదిలారని తెలుస్తున్నది.
South Africa:బంగారు నిల్వలు అధికంగా ఉండే దక్షిణాఫ్రికాలో అక్రమ మైనింగ్ సర్వసాధారణం. వందల సంఖ్యలో పాడుబడిన బంగారు గనులు వీటికి అడ్డాగా మారాయి. తవ్వకాల కోసం వెళ్లే కార్మికులు కొన్ని నెలలుగా అందులోనే ఉండి పోతున్నారు. వీరు వెళ్లేటప్పుడు ఆహారం, నీటితో పాటు జనరేటర్లు, ఇతర పరికరాలు లోపలికి తీసుకెళ్తారు. వాయువ్య ప్రావిన్స్‌లోని గనిలోకి వెళ్లిన వారిని జనవరి 10 నుంచి ఇప్పటి వరకు సుమారు 35 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. 24 మంది మృతదేహాలను వెలికి తీశారు. మరో 500 మంది గనిలోనే ఉన్నట్టు సమాచారం. వారంతా ఆకలితో అలమటిస్తున్నారని తెలిసింది.
South Africa:ఈ గనిలో కార్మికుల గల్లంతు విషయంలో ఓ వివాదం నడుస్తున్నది. కార్మికులు గని లోపలికి వెళ్లేందుకు ఉపయోగించే తాళ్లు, కప్పీ వ్యవస్థను పోలీసులు తొలగించడం వల్లే కార్మికులు బయటకు రాలేకపోతున్నారని పౌరసంఘాలు వాధిస్తున్నాయి. అయితే బయటకు వస్తే పోలీసులు అరెస్టు చేస్తారేమోనన్న భయంతోనే కార్మికులు గనిలోపలే ఉన్నారని పోలీసులు చెప్తున్నారు. ఏది ఏమైనా సుమారు 100 మంది కార్మికులు చనిపోవడం శోచనీయం.