Dharmapuri aravind: నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారాయి. ఆయన మాట్లాడుతూ, “బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే జైలు అనుభవం పొందారు. మళ్లీ ఎప్పుడు జైలుకు వెళ్తారో చెప్పలేం. అలాగే మాజీ మంత్రి కేటీఆర్ కూడా జైలుకు వెళ్లే సూచనలు పుష్కలంగా కనిపిస్తున్నాయి” అని అన్నారు. ఆయన బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తూ, ఆ పార్టీ త్వరలో భూస్థాపితం కానుందని, వారి గురించి మాట్లాడటం కూడా వ్యర్థమని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల విధానాలు తెలంగాణను దేశాన్ని పూర్తిగా నాశనం చేశాయని ఆరోపించారు. ఈ పార్టీలు తమ స్వప్రయోజనాల కోసం పాలనను జరిపాయని ధ్వజమెత్తారు. నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా, ఢిల్లీ నుండి వర్చువల్‌గా కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడారు.
పసుపు బోర్డు ఏర్పాటుకు సంబంధించి అనేక రాజకీయ కుట్రలు జరిగాయని, తాను కూడా అనేక వివాదాలకు గురయ్యానని గుర్తుచేశారు. పసుపు బోర్డు రైతులకు మాత్రమే కాకుండా పరిశ్రమలు, ప్రాసెసింగ్ యూనిట్లు, ప్యాకేజింగ్ యూనిట్లు, పర్యాటకం లాంటి అనేక కొత్త అవకాశాలను తెస్తుందని తెలిపారు. బీడీ కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి, గల్ఫ్ కార్మికుల తిరిగి వచ్చేందుకు కూడా ఇది సహాయపడుతుందని అన్నారు.
ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా, పీయూష్ గోయల్ కలిసి ఈ పసుపు బోర్డు నిజామాబాద్‌కు తీసుకురావడంలో ముఖ్యపాత్ర వహించారని ఆయన అభిప్రాయపడ్డారు. పసుపు పంటలపై అనుభవజ్ఞుడైన పల్లె గంగారెడ్డిని పసుపు బోర్డు చైర్మన్‌గా నియమించడం ఎంతో ఆనందకరమని అన్నారు.