Mahaa Vamsi Coment: పరువు పోయింది.. ప్రతిష్ట దిగజారింది.. నాగార్జునకు బెదిరింపులే మిగిలాయా? 

Mahaa Vamsi Coment: ప్రస్తుతం టాలీవుడ్ కి సంబంధించి అక్కినేని నాగార్జున కుటుంబ పరువు వ్యవహారమే హాట్ టాపిక్. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలతో.. మొదలైన వివాదం కోర్టులో నాగార్జున కుటుంబంతో సహా కేసు వేయడం వరకూ నడిచింది. ఇంకా నడుస్తోంది. ఈ మధ్యలో చాలా అంశాలు చక చకా జరిగిపోయాయి. ఒకరకంగా సినీ ఇండస్ట్రీ అంతా నాగార్జునకు సపోర్ట్ గా నిలిచింది. మంత్రి కొండా సురేఖపై ఒంటికాలిపై విరుచుకు పడింది. తరువాత నాగార్జున కోర్టుకెక్కడంతో.. ఆయన ఎన్ కన్వెన్షన్ పైన కూడా ఒక స్వచ్చంధ సంస్థ కేసు వేసింది. దీంతో సినీ ఇండస్ట్రీ సైలెన్స్ అయిపొయింది. ఇప్పుడు వ్యవహారం నాగార్జున vs  ప్రభుత్వం అన్నట్టుగా తయారైంది. ఎందుకంటే, మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను మొదట్లో తప్పుపట్టిన కాంగ్రెస్ పార్టీలోని వారే ఇప్పుడు ఆమెకు అండగా నిలిచారు. ఆమె సమంతకు క్షమాపణలు చెప్పి.. వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నాను అని చెప్పిన తరువాత కూడా నాగార్జున పరువు అంటూ కోర్టుకెక్కడం ప్రభుత్వంలోని పెద్దలకు నచ్చలేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నాగార్జునపై కొత్తగా కేసులు పెట్టె అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా ఎన్ కన్వెన్షన్ విషయంలో నాగార్జునను ఉక్కిరి బిక్కిరి చేసే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఆ దిశలో బెదిరింపులు మొదలైనట్లు తెలుస్తోంది. 

Mahaa Vamsi Coment: మంత్రి రాజకీయంగా కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ అన్న మాటలు నిజంగా నాగార్జున పరువు తీసేవిధంగానే ఉన్నాయి. అంతకంటే, ఎక్కువగా కేటీఆర్ ప్రతిష్ట దిగజార్చే విధంగా ఆ వ్యాఖ్యలు ఉన్నాయనేది నిజం. అయితే, రాజకీయాల్లో ఇప్పుడు విలువలు దిగజారిపోయాయి. ఏమైనా చేయవచ్చు.. ఎంత దిగజారి మాట్లాడితే అంత గొప్ప అనే విధంగా రాజకీయ నాయకులు తయారయ్యారు. ఇలాంటప్పుడు కేటీఆర్ ఆ వ్యాఖ్యలను అలానే తీసుకుని ఉండవచ్చు. కానీ, నాగార్జునకు రాజకీయాలకు సంబంధం లేదు. అయినా.. ఆయనను టార్గెట్ చేశారు? ఆలా ఏదో జరిగిపోయింది అని అనుకోవడానికి లేదు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే, ఇదంతా ప్రత్యేక టార్గెట్ గానే జరిగింది అని అనిపిస్తోంది. ఇప్పుడు కోర్టులో కేసు ఉంది. దానిపై వాదనలు.. ప్రతివాదనలు జరుగుతాయి.. రిజల్ట్ ఏదైనా కానీయండి.. దానికి సమయం పడుతుంది. ఈలోపు నాగార్జునకు బెదిరింపులు పెరుగుతాయనేది అందరూ అనుకునే మాట. ఇప్పటికే ఒక కేసును ఎదుర్కోవాల్సిన పరిస్థితిలో నాగార్జున ఉన్నారు. ఇక ఇలాంటివి మరికొన్ని కేసులు పెడితే? పరిస్థితి ఎలా ఉంటుంది? అన్నిటినీ నాగార్జున తట్టుకుని తన పరువు.. ప్రతిష్ట కోసం చివరి వరకూ పోరాడగలరా? పోరాడి నిలవగలరా? అనేది పెద్ద ప్రశ్న. 

Mahaa Vamsi Coment: అయితే, రాజకీయాల్లో ఎంత దిగజారి మాట్లాడితే అంత గొప్ప అనుకుంటున్న నాయకులు.. వారికి అలాంటి సలహాలు ఇస్తున్న వారు తెలుసుకోవలసిన నిజం ఒకటి ఉంది. ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వ హయాంలో మంత్రులుగా చేసిన కొందరు ఎంత దిగజారుడుగా మాట్లాడేవారో అందరికీ తెలిసిందే. ఎవ్వరినైనా సరే చెప్పలేని భాషలో దూషించడమే వారి పనిగా ఉండేది. అప్పట్లో వారు అధికారంలో ఒక వెలుగు వెలిగారు. ఎక్కడ మాట్లాడినా బూతుల పంచాంగం విప్పకుండా వీరెవరూ ఉండేవారు కాదు. సీన్ కట్ చేస్తే.. ఎన్నికలు వచ్చాయి. ఎవరైతే ఇలా ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకున్నారో.. వారిని ఈడ్చి ఆవతల పడేశారు ఓటర్లు. అసెంబ్లీలోకి కాదు కదా.. అసెంబ్లీ వైపు చూడాలంటే కూడా వణుకు వచ్చేలా వారికి ఓటుతో బుద్ధి చెప్పారు ప్రజలు. ఇది ప్రజాక్షేత్రంలో ఉన్న అందరు నాయకులూ తెల్సుకోవాలి. ప్రజలు గమనిస్తారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే క్షమించరు. సమాజంలో విలువ పోతుంది. అందుకే.. తస్మాత్ జాగ్రత్త.. నోరు అదుపులో ఉంటే అందరికీ మంచిది. 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *