జమ్మూకశ్మీర్‌లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి అధికారాన్ని చేజిక్కించుకుంది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గాను కూటమి 46 (మ్యాజిక్ ఫిగర్) సీట్లు సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈసీ లెక్కల ప్రకారం ఎన్సీ 40, కాంగ్రెస్ 6 చోట్ల విజయం సాధించాయి. ఎన్సీ మరో 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అటు బీజేపీకి 27, పీడీపీకి 3 సీట్లు దక్కాయి.
జమ్మూ కశ్మీర్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎట్టకేలకు బోణీ కొట్టింది. జమ్మూ రీజియన్‌లోని దొడ నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి మెహ్రాజ్ మాలిక్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి, బీజేపీ నేత గజయ్ సింగ్ రాణాపై ఆయన 4,470 ఓట్ల తేడాతో విజయం సాధించారు. పోలైన మొత్తం ఓట్లలో మాలిక్‌కు 22,944 ఓట్లు రాగా, రాణాకు 18,174 ఓట్లు వచ్చాయి. కాగా మాలిక్‌ను ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ అభినందించారు.
జమ్మూ కశ్మీర్‌లో పీడీపీ పట్టుకోల్పోతోంది. 2014 ఎన్నికల్లో ముఫ్తీ మొహమ్మద్ సారథ్యంలో 28 సీట్లు గెలిచిన ఆ పార్టీ ప్రస్తుత ఎన్నికల్లో 4 స్థానాలకు పరిమితమైంది. 2014లో ముక్కోణపు పోటీలో హంగ్ ఏర్పడింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీతో పీడీపీ చేతులుకలపడం ప్రజలకు రుచించినట్టు లేదు. జమ్మూ కశ్మీర్ ఓటర్లు ఆ పార్టీని తిరస్కరించారు. పార్టీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆమె కుమార్తె ఇల్తిజా ఓటమిపాలయ్యారు.

