Padi Kaushik Reddy: హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అరెస్టు వ్యవహారం గురువారం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కౌశిక్‌రెడ్డిని ఓ వైపు అరెస్టు చేస్తూనే, మరో వైపు ఆయనకు మద్దతుగా ఇంటికి వెళ్లిన బీఆర్ఎస్ ముఖ్య నేతలను సైతం పోలీసులు అరెస్టు చేశారు. ఈ సమయంలో పోలీసులు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నది. ఓ దశలో ఏమి జరుగుతుందనే లోపే ప్లాన్ ప్రకారం వచ్చినవారిని వచ్చినట్టే పోలీసులు వెంటవెంటనే అదుపులోకి తీసుకొని తరలించసాగారు. హైదరాబాద్ కొండాపూర్‌లోని కౌశిక్‌రెడ్డి నివాసం వద్ద ఈ ఘటన చోటుచేసుకున్నది.
Padi Kaushik Reddy: సీఎం, డీజీపీ తన ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడుతున్నారంటూ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి నిన్న బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చేందుకు కొందరు సహచరులతో కలిసి వెళ్లారు. ఆయన వెళ్లిన కొద్దిసేపటికే ఏసీపీ బయటకు వెళ్లిపోయారు. ఈ లోగా అక్కడే ఉన్న సీఐకి ఇచ్చేందుకు వెళ్తుండగా, దానిని గమనించిన సీఐ కూడా బయటకు వెళ్లేందుకు సిద్ధమయ్యారని కౌశిక్, ఇతర బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. బయటకు వెళ్తున్న తనను కౌశిక్‌రెడ్డి, ఇతరులు అడ్డుకొని బలవంత పెడుతూ, తన విధులకు ఆటంకం కలిగించారన్నది పోలీసులు వాదన.
Padi Kaushik Reddy: సీఐ విధులకు ఆటంకం కలిగించారంటూ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. గురువారం ఎలాగైనా కౌశిక్‌ను అరెస్టు చేస్తారేమోనన్న అనుమానంతో బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు సహా పలువురు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కౌశిక్‌రెడ్డి ఇంటివద్దకు తెల్లవారుజామునే చేరుకున్నారు.
Padi Kaushik Reddy: ఈ సందర్భంగా కౌశిక్‌రెడ్డి ఇంటిలోనికి బీఆర్ఎస్ నేతలు ఎవరినీ వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ దశలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు గేటును మూసి ఉంచి ఎవరినీ వెళ్లనీయలేదు. దీంతో అసహనంతో ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు ప్రధాన గేటు దూకి లోనికి వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. ఇదే సమయంలో అక్కడికి హరీశ్‌రావు చేరుకున్నారు. కౌశిక్‌రెడ్డిని కలవనీకుండా హరీశ్‌రావును బయటే అడ్డుకున్నారు. ఈ దశలోనూ ఉద్రిక్తత నెలకొన్నది. పోలీసులు బలవంతంగా హరీశ్‌ను కారులో ఎక్కించేందుకు ప్రయత్నించారు.
Padi Kaushik Reddy: ఇదే సమయంలో హరీశ్‌రావుపై ఓ పోలీసు చేసిన వ్యాఖ్యలతో బీఆర్ఎస్ శ్రేణులు మరింతగా రెచ్చిపోయి కారుకు అడ్డుగా నిలిచి నినాదాలు చేశారు. ఎక్కువ చేయకు, తమాషా చేయకు వెళ్లి కూర్చో అంటూ తనను అసభ్యంగా మాట్లాడాడంటూ హరీశ్‌రావు కూడా గట్టిగా ప్రతిఘటించారు. అయినా పోలీసులు బలవంతంగా కారులో నెట్టి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇదే సమయంలో అక్కడికి చేరుకున్న మాజీ మంత్రి గుంతకండ్ల జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే కొత్తా ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు తదితరులను పోలీసులు అరెస్టు చేసి పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.