Srisailam: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైల భ్రమరాంభికా మల్లికార్జున స్వామి ఆలయ దర్శనాల్లో పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన, అష్ఠాదశ శక్తి పీఠాల్లో ఒకటైన ఈ ఆలయంలో మార్పులకు శ్రీకారం చుట్టినట్టు దేవస్థాన ఈవో చంద్రశేఖర్ ఆజాద్ మంగళవారం వెల్లడించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల రద్దీ దృష్ట్యా ప్రతి శని, ఆది, సోమవారాలు, ప్రభుత్వ సెలవు దినాల్లో ఆలయ వైదిక కమిటీ నిర్ధారించిన మేరకు భక్తులందరికీ స్వామివారి అలంకరణ దర్శనం మాత్రమే కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్టు ఈవో తెలిపారు.
శ్రీశైలం దేవస్థాన వైదిక కమిటీ సూచించిన విశేష రోజుల్లో రూ.500 రుసుంతో కల్పిస్తున్న స్వామివారి సర్వదర్శనం, రూ.5 వేల రుసుంతో నిర్వహిస్తున్న గర్భాలయ ఆర్జిత అభిషేకాలు, రూ.1500 రుసుంతో నిర్వహిస్తున్న సామూహిక ఆర్థిత అభిషేకాలను పూర్తిగా నిలుపుదల చేయనున్నట్టు తెలిపారు. ఆన్‌లైన్ టికెట్లు అన్నింటినీ నిలుపుదల చేస్తున్నామని, భక్తులందరూ ఈ మార్పులు, చేర్పులను గమనించాలని ఆయన పేర్కొన్నారు.