kakinada Port: ఏది దొరికితే అది.. తనవాళ్లకు దోచిపెట్టడమే పనిగా సాగింది గత ప్రభుత్వ వైఖరి. ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఏ చిన్న స్కామ్ బయటపడినా దాని లింక్ లు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వైపు నేరుగా వెళుతున్నాయి. రైస్ మాఫియాకు సంబంధించి కొంతకాలంగా జరుగుతున్న రచ్చలో.. ఇప్పుడు కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. కాకినాడ పోర్టుకు సంబంధించి అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన నిర్వాకం బయటపడింది. నిబంధనలను పక్కన పెట్టేయడం.. ఇంకా చెప్పాలంటే నిబంధనలనేవే తమకు పట్టనట్టుగా వ్యవహరించడం జగన్మోహన్ రెడ్డికి చాలా అలవాటైన వ్యవహారం. అందుకే కాకినాడ పోర్టు విషయంలోనూ నిబంధనలకు ఈజీగా పాతరేశారు. అస్మదీయుల కోసం అప్పనంగా కట్టబెట్టేశారు. కాకినాడ పోర్టును, సెజ్ ను అరబిందో రియాల్టీ కి ధారా దత్తం చేసేసింది వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం.
ఈ క్రమంలో అరబిందో రియాలిటీ కోసం ఎవరికైనా 75 కిలోమీటర్ల పరిధిలో 2 పోర్టులు ఉండకూడదు అనే నిబంధనలనూ రద్దు చేసేసి అరబిందో రియాలిటీకి కట్టపెట్టేసింది జగన్ ప్రభుత్వం. ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాకినాడ సీ పోర్టు, సెజ్ పై జగన్ అండ్ కో దృష్టి పడింది. దీనిని స్వాధీనం చేసుకోవడానికి అరబిందో రియాల్టీ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ రంగంలోకి దిగింది.
2020 డిసెంబర్ లో ఏకంగా 41.12 శాతం (2,15,50,905 షేర్లు) అరబిందో రియాలిటీ కి బదిలీ చేయడానికి ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది.
kakinada Port: నిజానికి కాకినాడ సీ పోర్టు పై… ఇంటర్నేషనల్ సీ పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ తో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 1999 మార్చి లో కన్సీషన్ అగ్రిమెంట్ ను కుదుర్చుకుంది. ఈ ఇంటర్నేషనల్ సీ పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కాకినాడ సీ పోర్ట్ కోసం (ఎస్ పి వి) కొకనాడ పోర్టు కంపెనీని ఏర్పాటు చేసింది. 2001 సెప్టెంబర్ లో కొకనాడ పోర్టు పేరు ను కాకినాడ సీ పోర్ట్ గా మార్చారు. అప్పటి నుంచీ కాకినాడ సీ పోర్టు కె.వి.రావు సారధ్యంలో అద్భుతంగా పని చేస్తూ వచ్చింది. ఎప్పుడైతే జగన్ అండ్ కో కన్ను దానిమీద పడిందో అప్పుడే కెవీ రావును బెదిరించి కాకినాడపోర్టును కొట్టేశారు.అరబిందో రియాలిటీకి అడ్డగోలుగా అప్పగించారు.
2020 లో అరబిందో రియాలిటీ రంగ ప్రవేశంతో పోర్టు చేతులు మారింది. అప్పటి వరకూ కాకినాడ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పై ఉన్న 41.12 శాతం షేరులు అరబిందో రియాలిటీ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ చేతిలోకి వచ్చి పడ్డాయి. జగన్ ప్రభుత్వం 2020 డిసెంబర్ లో ఈ బదిలీకి ఆమోద ముద్ర వేసింది. కాకినాడ సీ పోర్టు అరబిందో చేతికి వచ్చిన సమయంలోనే కాకినాడ సెజ్, కాకినాడ గేట్ వే పోర్టూ కూడా అరబిందో పరం అయ్యాయి.
kakinada Port: కాకినాడ సెజ్ అదే సమయంలో కాకినాడ గేట్ వే పోర్టు లిమిటెడ్ 100 శాతం ఈక్విటీ అరబిందో రియాలిటీ కి ఇచ్చేసినట్లు జి ఎం ఆర్ గ్రూప్ 2020 సెప్టెంబర్ లో ప్రకటించింది. కన్సీషన్ అగ్రిమెంట్ ప్రకారం 75 కిలోమీటర్ల పరిధిలో ఒక్కరే రెండు పోర్టులు తీసుకోకూడదు. ఉండకూడదు. అది కచ్చితమైన రూల్. దీంతో ఈ షరతును ఎత్తివేయాలని అరబిందో రియాలిటీ జగన్ ప్రభుత్వాన్ని కోరింది.
2021 మార్చి న ఈ షరతును ఎత్తివేస్తూ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల అరబిందో రియాలిటీ కాకినాడ సెజ్ లో 99.74 శాతం, కాకినాడ గేట్ వే పోర్టు ను సొంతం చేసుకోవడానికి మార్గం సుగమం అయింది. అంతకు ముందే కాకినాడ సీ పోర్టు లో 41.12 శాతం వాటా అరబిందో చేతికి వచ్చింది.
kakinada Port: మొత్తంగా చూసుకుంటే, నిబంధనలకు పాతరేసి.. అయినవాళ్లకు అన్నీ కట్టబెట్టి పెద్ద దోపిడీకి తెర తీసింది అప్పటి జగన్ సర్కార్. ఇప్పుడు రైస్ మాఫియా చెలరేగిపోవడానికి కాకినాడ పోర్టు తమ అస్మదీయ కంపెనీ అరబిందో చేతిలో ఉండడం కూడా బాగా కలిసి వచ్చింది. దీంతో ఇష్టానుసారంగా కాకినాడ పోర్టులో తమ దందాను నడిపించారు. వసూళ్లు.. అక్రమ బియ్యం రవాణా ఒక్కటేమిటి ఏది వీలయితే అది.. ఎలా వీలయితే అలా అన్నిరకాలుగానూ తమ హవా నడిపించుకోవడానికి కాకినాడ డీ గ్యాంగ్ కు అవకాశం చిక్కింది. ఇప్పుడు ప్రభుత్వం లోతైన విచారణ జరిపిస్తే కాకినాడ పోర్టుకు సంబంధించి మరిన్ని సంచలనాత్మక విషయాలు బయటకు వస్తాయనడంలో సందేహం లేదు.

