Champions Trophy 2025: ఏ ముహూర్తాన ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్ లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారో కానీ, అది అది మొదటి నుంచి గందరగోళంగానే నడుస్తోంది. మొదటి నుంచి పాకిస్థాన్ లో ఆడే విషయంలో భారత్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉంది. అక్కడి పరిస్థితులు.. భద్రతా కారణాలను ఎట్టి చూపిస్తూ భారత్ పాకిస్థాన్ లో జరిగే టోర్నీలో పాల్గొనడానికి నిరాకరిస్తూ వస్తోంది. అయితే, పాకిస్థాన్ మాత్రం ఎలాంటి పరిస్థితిలోనూ భారత్ కూడా రావాల్సిందే అనీ.. భద్రతకు తాము హామీ ఇస్తామని చెబుతూ వస్తోంది. అంతేకాకుండా.. భారత్ కు ఇబ్బంది ఉంటే టోర్నీ జరిగే సమయంలో మ్యాచ్ అయిపోయిన తరువాత తిరిగి వెళ్ళిపోయి.. తదుపరి మ్యాచ్ కు మళ్ళీ రావచ్చని కూడా చెప్పింది. అయితే, భారత్ మాత్రం తటస్థ వేదికపై తమ మ్యాచ్ లు ఉండాలని పట్టు పట్టింది. ఈ ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది.
Champions Trophy 2025: ఇప్పుడు పాకిస్థాన్ పరిస్థితి చూస్తే అసలు ఛాంపియన్స్ ట్రోఫీకి నిర్వహించగలదా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. మరో మూడు నెలల్లో ట్రోఫీ జరగాల్సి ఉంది. ఈలోపు పాకిస్థాన్ పరిస్థితులు అల్లకల్లోలంగా మారాయి. ప్రస్తుత అక్కడ అంతర్గతంగా పెద్ద యుద్ధమే నడుస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను జైలు నుంచి విడుదల చేయాలంటూ పెద్ద ఎత్తున అక్కడ ఆందోళనలు కొనసాగుతోన్నాయి. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను జైలు నుండి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన పార్టీ పిటిఐ మద్దతుదారులు వీధుల్లోకి వచ్చి రాజధాని ఇస్లామాబాద్‌ను చుట్టుముట్టారు. ఆ తర్వాత భద్రతా సిబ్బంది, ఆందోళనకారుల మధ్య హింసాత్మక ఘర్షణ జరిగింది.
ఇమ్రాన్ ఖాన్ పార్టీ నిరసనలు . .
Champions Trophy 2025: పాకిస్తాన్ నుండి వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం లాక్డౌన్ విఫలమైన తరువాత, పారామిలటరీ రేంజర్లు నిరసనకారులపై టియర్ గ్యాస్, రబ్బరు బుల్లెట్లను ప్రయోగించారు. దీని కారణంగా పరిస్థితి అదుపు తప్పింది. నిరసనకారులు నేరుగా భద్రతా దళాలపై దాడి చేశారు. తరువాత జరిగిన హింసలో, 4 పాకిస్తాన్ రేంజర్లు మరణించారు. దీని తరువాత మొహ్సిన్ నఖ్వీ నిరసనకారులకు బుల్లెట్లతో సమాధానం ఇవ్వాలని హెచ్చరిక జారీ చేశాడు. సైన్యాన్ని మోహరించే సమయంలో, కనిపించినప్పుడు కాల్చమని ఆదేశాలు ఇచ్చాడు. మొహ్సిన్ నఖ్వీ పాకిస్థాన్ ఇంటీరియర్ మినిస్టర్ మాత్రమే కాకుండా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ కూడా. దీంతో ఇప్పుడు దేశంలో అంతర్గతంగా హింసాకాండ అదుపు చేయలేని వారు.. క్రికెట్ టోర్నీకి భద్రత కల్పించగలరా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పటివరకూ పాకిస్థాన్ లో ట్రోఫీ నిర్వహణ విషయంలో నఖ్వీ చేస్తూ వస్తున్న వాదన డొల్లగా మారిపోయిన పరిస్థితులు అక్కడ ఉన్నాయి.
షియా – సున్నీల ఘర్షణలు . .
Champions Trophy 2025: ఇదిలా ఉంటే మరోవైపు ప్రస్తుతం పాకిస్తాన్‌లో షియా – సున్నీ ముస్లింల మధ్య తీవ్ర వివాదం నడుస్తోంది, ఇందులో ఇటీవలి కాలంలో 150 మంది మరణించారు. ఈ సంఘర్షణను అరికట్టేందుకు పాక్ సైన్యం ప్రయత్నిస్తున్నా ఇక్కడ సఫలం కాలేదు. పైగా ఇప్పుడు రాజధానిలో అదుపు తప్పిన ఇమ్రాన్ మద్దతుదారులు సైన్యానికి, ప్రభుత్వానికి పెను సవాల్‌గా మారారు.
Champions Trophy 2025: తాజా పరిస్థితి ఆ దేశానికే కాదు, పాకిస్థాన్ క్రికెట్ బోర్డును కూడా కలవరపెడుతోంది. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించాలన్న ఆశలకు పెద్ద దెబ్బ తగిలింది. టోర్నమెంట్‌కు వేదికైన రావల్పిండి క్రికెట్ స్టేడియం రాజధాని ఇస్లామాబాద్‌కు కేవలం 14-15 కిలోమీటర్ల దూరంలో ఉండడమే దీనికి ప్రధాన కారణం. అటువంటి పరిస్థితిలో, దేశంలోని అత్యంత ముఖ్యమైన ప్రాంతమైన దేశ రాజధానిలోనే భద్రత పటిష్టంగా లేకపోతే, రావల్పిండి, కరాచీ లేదా లాహోర్‌లో భద్రత ఎలా ఉంటుంది? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
ఇప్పుడేం జరగవచ్చు..
Champions Trophy 2025: నవంబర్ 29న ఐసీసీ వర్చువల్ సమావేశం నిర్వహిస్తోంది. దీని ప్రధాన ఎజెండా ఛాంపియన్స్ ట్రోఫీ. ఈ మీటింగ్ లో పీసీబీ,బీసీసీఐ తో పాటు మిగిలిన బోర్డు సభ్యులు కూడా హాజరు అవుతారు. అప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే విషయంలో ఆయా బోర్డులు స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తరువాత టోర్నమెంట్ పై నిర్ణయం తీసుకుంటారు. టోర్నీ పాకిస్థాన్ లో నిర్వహించాలా? హైబ్రిడ్ మోడ్ లో నిర్వహించాలా? అనే విషయంపై ఆ మీటింగ్ లో స్పష్టమైన నిర్ణయం తీసుకుంటారు. నిజానికి ఛాంపియన్స్ ట్రోఫీని ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్థాన్ నిర్వహించడం కష్టమనే చెప్పాలి. ఈ నేపథ్యంలో హైబ్రిడ్ మోడ్ వైపు నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఒకవేళ లా హైబ్రిడ్ మోడ్ వైపు అన్ని బోర్డులు అంగీకారం తెలిపినా అది పాకిస్థాన్ కు పెద్ద ఊరట ఇస్తుందనడంలో సందేహం లేదు. కానీ.. అసలు టోర్నీ నిర్వహించే అవకాశం.. దానికి అనుకూల పరిస్థితులు పాకిస్థాన్ లో ఉన్నాయా అనేదే పెద్ద ప్రశ్న!