Talliki Vandanam Scheme: కర్నూలు జిల్లాలో అమ్మల ఆశల పై నీళ్లు చల్లుతూ ఒక దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకం కింద అర్హులైన తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేసిన సంగతి తెలిసిందే. పిల్లల చదువులకు, ఇంటి అవసరాలకు ఆ డబ్బులు ఉపయోగపడతాయని సంబరపడ్డ పేద తల్లులకు ఊహించని షాక్ తగిలింది.
ఎయిర్‌టెల్ సిమ్ కార్డులు అమ్మే సేల్స్ బాయ్స్ రూపంలో వచ్చిన కేటుగాళ్లు ఈ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్నారు. సిమ్‌లు ఇచ్చే సమయంలోనే లబ్ధిదారుల ఆధార్ వివరాలు, వేలిముద్రలు, బ్యాంక్ అకౌంట్ వివరాలను చాలా చాకచక్యంగా సేకరించారు. ఆ వివరాల ఆధారంగా దాదాపు 28 మంది తల్లుల ఖాతాల నుంచి డబ్బులను మాయం చేశారు.
తీరా అకౌంట్ చూసుకుంటే డబ్బులు లేకపోవడంతో, ఏం జరిగిందో తెలియక ఆ తల్లులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దగాకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఉపేంద్ర, వీరారెడ్డి అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇలాంటి ప్రభుత్వ పథకాల డబ్బుల విషయంలో మోసాలు జరగడం ఇదే మొదటిసారి కాదు. అందుకే ప్రజలు కొంచెం జాగ్రత్తగా ఉండాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
-
ఎవరికీ మీ ఆధార్, బ్యాంక్ వివరాలు, ఓటీపీ (OTP) వివరాలు చెప్పకండి.
-
వాట్సాప్ లేదా మెసేజ్‌లలో వచ్చే అనుమానాస్పద లింకులను అస్సలు క్లిక్ చేయకండి.
