Congress Party: పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకున్నది. మూడింట రెండొంతులకు తక్కువగా స్థానాలను దక్కించుకున్నది. విపక్ష బీఆర్ఎస్ పార్టీ ఊహించిన దానికంటే మించి సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకున్నది. ఇదే ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో, సొంతూళ్లలోనూ ఫలితాలు తారుమారాయి. పలుచోట్ల అధికార పార్టీ ఓడి, ప్రతిపక్ష బీఆర్ఎస్, స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు.
Congress Party: పంచాయతీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ నిర్వహించిన పోస్టుమార్టమ్‌లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓటమి చెందిన స్థానాలపై విశ్లేషించుకున్నారు.
Congress Party: ముఖ్యంగా 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని, ఫలితాలు తారుమారు అయ్యాయని సమావేశం భావించింది. ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల సొంత గ్రామాలతోపాటు పార్టీకి పట్టున్న చాలా గ్రామాల్లో కాంగ్రెస్ రెబల్స్ విజయం సాధించారు. తమ బంధువులను, తమ మాట వినేవారిని పెట్టుకొని ఓటమిని చవిచూశారు. ప్రజా బలం ఉన్న వారిని విస్మరించడంతో ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చినట్టయింది.
Congress Party: సర్పంచ్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాని నియోజకవర్గాల ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్‌రెడ్డి, మహేశ్‌కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ సీరియస్ అయ్యారని తెలిసింది. ఆ 18 మంది ఎమ్మెల్యేలపై అసహనం వ్యక్తం చేశారని సమాచారం. సొంత బంధువులకు టికెట్లు ఇచ్చి పార్టీకి నష్టం కొని తెచ్చారని, రెబల్స్‌ను కనీసం బుజ్జగించలేదని మండిపడ్డారు.
Congress Party: ముఖ్యంగా వరంగల్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల పరిధిలో ఆ 18 మంది అత్యధిక మంది ఉన్నట్టు సమాచారం. ఈ వైఫల్యాలు మళ్లీ రిపీట్ అయితే సహించేది లేదని, భవిష్యత్తులో ప్రాధాన్యం తగ్గుతుందని హెచ్చరించినట్టు తెలిసింది. వారందరికీ సీఎం సహా పార్టీ పెద్దలు క్లాస్ తీసుకున్నారని తెలిసింది.
కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల వైఫల్యాలు ఇవే..
Congress Party: కొందరు అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ సొంతూళ్లలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైఫల్యాలను మూటగట్టుకున్నారు. ఓ ఎమ్మెల్యే తన సొంత పంచాయతీలో తన సొంత అన్న భార్య (వదిన)ను నిలబెట్టారు. అదే స్థానంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్‌కు సీటు దక్కలేదని తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.
Congress Party: ఇదే పంచాయతీ ఎన్నికలలో మరో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకు విచిత్ర పరిస్థితి ఎదురైంది. సొంత గ్రామ పంచాయతీతోపాటు నియోజకవర్గ కేంద్ర పంచాయతీలో, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఉన్న గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఓటమిని చవిచూశారు. ఆయా చోట్ల రెండు పంచాయతీల్లో బీఆర్ఎస్, ఒక పంచాయతీలో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు.
Congress Party: దక్షిణ తెలంగాణకు చెందిన ఓ నలుగురు మంత్రుల నియోజకవర్గాల పరిధిలో కూడా బీఆర్ఎస్ ఊహించిన దానికన్నా ఎక్కువ చోట్ల గెలుపొంది, కాంగ్రెస్‌కు చాలెంజ్ విసిరింది. ఓ మంత్రి నియోజకవర్గంలోని మూడు ప్రధాన మేజర్ పంచాయతీల్లో బీఆర్ఎస్ గెలుపొందింది. ఆయన జిల్లాకే చెందిన మరో మంత్రి నియోజకవర్గంలోని సొంత మండలంలో బీఆర్ఎస్ అధిక స్థానాల్లో విజయం సాధించింది. మరో మంత్రి నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్నది.

