Shamli: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షామ్లీ జిల్లాలో మానవత్వాన్ని మంటగలిపే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. బుర్కా ధరించలేదన్న చిన్న కారణంతో తన భార్యను, ఇద్దరు కుమార్తెలను ఒక తండ్రి కిరాతకంగా కాల్చి చంపి ఇంటి ఆవరణలోనే పాతిపెట్టిన ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కాంధ్లా పోలీస్‌స్టేషన్ పరిధిలోని గఢీ దౌలత్ గ్రామానికి చెందిన ఫరూఖ్ అనే వ్యక్తి హోటల్‌లో రోటీ మాస్టర్‌గా పనిచేస్తూ తన భార్య తాహిరా, ఐదుగురు పిల్లలతో నివసించేవాడు. డబ్బు విషయంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే ఒకసారి కోపంతో భార్య బుర్కా ధరించకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లడాన్ని ఫరూఖ్ తీవ్ర అవమానంగా భావించి, ఎలాగైనా ఆమెను అంతం చేయాలని పక్కా పథకం రచించాడు.
Also Read: Bharat Taxi App: భారత్ ట్యాక్సీ వచ్చేస్తోంది..! డ్రైవర్లకు 80%.. ఇప్పటికే 56 వేల మంది నమోదు
మొదట ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ఇంటి ఆవరణలో సెప్టిక్ ట్యాంక్ కోసం ఒక పెద్ద గొయ్యిని తవ్వించాడు. అనంతరం క్యారానా అనే ప్రాంతం నుంచి అక్రమంగా ఒక తుపాకీని సేకరించి, పుట్టింట్లో ఉన్న తన భార్య తాహిరాను ఇంటికి పిలిపించాడు. పథకం ప్రకారం ఆమెపై కాల్పులు జరిపి చంపేయగా, ఆ శబ్దానికి నిద్రలేచిన కుమార్తెలు ఆఫ్రీన్ (16), సహరీన్ (14)లను కూడా కనికరం లేకుండా కాల్చి చంపాడు. అనంతరం వారి ముగ్గురి మృతదేహాలను ముందుగా తవ్వించిన సెప్టిక్ ట్యాంక్ గొయ్యిలో వేసి పూడ్చిపెట్టాడు. తన భార్యాపిల్లలు కనిపించడం లేదని ఫరూఖ్ తండ్రి దావూద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది.
పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితుడు ఫరూఖ్ పొంతన లేని సమాధానాలు చెప్పినప్పటికీ, పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు నిజాన్ని ఒప్పుకున్నాడు. బుర్కా వేసుకోకుండా బయటకు వెళ్లడం వల్ల సమాజంలో తనకు తలవంపులు వస్తున్నాయని, ఆ అవమానాన్ని భరించలేకనే ఈ హత్యలు చేసినట్లు అతడు స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి, ఇంటి ఆవరణలో పాతిపెట్టిన మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ట్రిపుల్ మర్డర్ ఘటనతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా భయాందోళనలకు గురైంది.

