Vivaha Bandham: నటరత్న యన్టీఆర్, మహానటి భానుమతి జంటను తలచుకోగానే ముందుగా ‘మల్లీశ్వరి’ వంటి కళాఖండం గుర్తుకు వస్తుంది. ఆ తరువాతే వారిద్దరూ జోడీ కట్టిన అనేక చిత్రాలు మన స్మృతి పథంలో మెదలుతాయి. భానుమతి, ఆమె భర్త రామకృష్ణ నెలకొల్పిన భరణీ పిక్చర్స్ పతాకంపై రూపొందిన “చండీరాణి, చింతామణి, వివాహబంధం, అమ్మాయిపెళ్ళి” వంటి చిత్రాలలో యన్టీఆర్ నటించారు. రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వివాహబంధం’ 1964 అక్టోబర్ 23న విడుదలయింది.
ఓ రిటైర్డ్ కాలేజ్ ప్రిన్సిపల్ కూతురు భారతి, లెక్చరర్ చంద్రశేఖరాన్ని ప్రేమించి పెళ్ళాడుతుంది. అంతస్తుల అంతరం ప్రేమించేటప్పుడు కనిపించదు కానీ, కాపురం చేసే రోజుల్లో భారతి అహం ప్రదర్శిస్తుంది. కీచులాటలు మొదలవుతాయి. అయితే చివరకు అన్నీటీ కప్పులో తుఫానులా సమసిపోయి, చంద్రశేఖర్, భారతి ఆనందంగా కాపురం చేయడంతో కథ సుఖాంతమవుతుంది. భానుమతి రామకృష్ణ సంగీత పర్యవేక్షణలో ఎమ్.బి.శ్రీనివాసన్ ఈ చిత్రానికి స్వరకల్పన చేశారు. సి.నారాయణ రెడ్డి కలం పలికించిన పాటల్లో కొన్ని ఆకట్టుకున్నాయి. ఇందులో ‘నగుమోము.. గనలేని…’ అనే త్యాగరాజు కీర్తన కూడా అలరిస్తుంది. ‘వివాహబంధం’ రిపీట్ రన్స్ లోనూ అలరించింది.

