Bangladeshis: ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఐదుగురు బంగ్లాదేశ్ పౌరులను పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా 20 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు గల యువకులు. వీరు ఎర్రకోట ప్రాంగణంలోకి బలవంతంగా చొరబడేందుకు ప్రయత్నించగా, భద్రతా సిబ్బంది వారిని అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు.
అరెస్ట్ అయిన వారి వద్ద బంగ్లాదేశ్ పౌరసత్వాన్ని నిర్ధారించే ఎలాంటి పత్రాలు లేవని, వారు అక్రమంగా నివసిస్తున్నారని పోలీసులు గుర్తించారు. అరెస్ట్ అయిన యువకులు ఢిల్లీలో కూలీలుగా పనిచేస్తున్నట్లు సమాచారం. ఈ ఘటన నేపథ్యంలో ఢిల్లీ మరియు గురుగ్రామ్ (హర్యానా) ప్రాంతాల్లో అక్రమ వలసదారుల కోసం పోలీసులు అప్రమత్తమయ్యారు. అదే సమయంలో, గురుగ్రామ్‌లో మరో పది మంది బంగ్లాదేశీ అక్రమ నివాసితులు పట్టుబడ్డారు.
ఇది కూడా చదవండి: Gas Cylinder Blast: గ్యాస్ సిలిండర్ పేలుడు… ఒకరి మృతి, ముగ్గురికి గాయాలు
ఇటువంటి అక్రమ ప్రవేశ ప్రయత్నాలు జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమించే అవకాశం ఉన్నందున, అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. అక్రమ వలసదారులను గుర్తించి వారిని వెనక్కి పంపించడానికి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా స్వాతంత్ర్య దినోత్సవం సమీపిస్తున్నందున ఢిల్లీలోని ఎర్రకోట వద్ద భద్రతను పటిష్టం చేశారు. ఆగస్టు 15న ఎర్రకోటలో ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఎగురవేసి దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
ఈ నేపథ్యంలో పోలీసులు భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. ఆగస్టు 16 వరకు ఢిల్లీ గగనతలంలో డ్రోన్లు, పారాగ్లైడర్లు, ఇతర ఏరియల్ ప్లాట్‌ఫారమ్‌లపై నిషేధం విధించారు. ఈ ఏడాది 10,000 మందికి పైగా భద్రతా సిబ్బంది, ఇందులో 3,000 మంది ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు, ఎర్రకోట వద్ద బందోబస్తు నిర్వహించనున్నారు.