Tamil Nadu: తమిళనాడులోని కొన్ని మారుమూల ప్రాంతాల్లో నేటికి బాల్య వివాహాలు జరుగుతున్నాయి. అందుకు ఉదాహరణ తాజాగా ఓ చిన్నారి పెళ్ళికూతురు రోదించే దృశ్యాలు అందరినీ కన్నీరు పెట్టిస్తున్నాయి. తమిళనాడు కృష్ణగిరి జిల్లా హోసూర్ గ్రామానికి చెందిన 14 ఏళ్ల చిన్నారికి పెళ్లి చేశారు. తనకు ఇష్టం లేకున్న బెంగుళూరులోని 29 ఏళ్ల అబ్బాయికి ఇచ్చి బాల్య వివాహం చేశారు. పెళ్లి అనంతరం అత్తగారి ఇంటికి వెళ్లనని ఆ చిన్నారి ఏడ్చింది. నేను వెళ్లనని గుండెలు అలిసేలా రోదించింది. అయితే బాలికకు ఇరువైపుల బంధువులు నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేశారు.
కానీ అభంశుభం తెలియని ఆ చిన్నారి పెళ్లి కూతురు అత్తారింటికి వెళ్లడానికి నిరాకరించింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పెళ్లి కొడుకు ఎం మాదేశ్ కనికరం లేకుండా బాలికను భుజాలపై ఎత్తుకొని బలవంతంగా తీసుకెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. విషయం తెలుసుకున్న పోలీసులు కృష్ణగిరి పోలీసులు బాల్య వివాహం, పోక్సో చట్టం కింద తల్లిదండ్రులతో సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు. అందులో భర్తను, భర్త తమ్ముడు, బాలిక తల్లిని అదుపులోకి తీసుకున్నారు.
Also Read: Hyderabad: హైదరాబాద్‌లో బయట పడ్డ భారీ మోసం
తల్లిదండ్రులు ఆ బాలికను తనకు వివాహం గురించి సమాచారం చెప్పకుండా ఒక ఆలయానికి తీసుకెళ్లి ఎం మాదేశ్‌తో బలవంతంగా పెళ్లి చేయించారు. ఈ క్రమంలోనే ఆ అమ్మాయి ఇంటి నుంచి తప్పించుకోని తన అమ్మమ్మ ఇంట్లో ఆశ్రయం పొందింది. కానీ మాదేశ్, అతని సోదరుడు మల్లేశ్, కుటుంబ సభ్యులతో కలిసి ఆమెను బలవంతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే బాలిక తల్లిదండ్రులతో పాటు ఐదుగురిని అరెస్ట్ చేశారు.
ఆ బాలిక తనపై లైంగిక దాడి జరగలేదని చెప్పినట్లు కృష్ణగిరి ఎస్పీ తెలిపారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇక ఆ బాలికకు కృష్ణగిరిలోని వన్ స్టాప్ సెంటర్‌కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చారు. కాగా, తమిళనాడులో 2024లో 55.6 శాతం బాల్య వివాహాలు పెరిగాయి. 2023లో 1,054 బాల్యవివాహాలు జరగ్గా, ఆ సంఖ్య 2024 నాటికి 1640 కు పెరిగింది.